గద్వాల్ విషాదంలో మునిగిపోయింది. నడిగడ్డపై ఎక్కడ చూసినా.. కన్నీటి వేదనే కనిపిస్తోంది. రాజమండ్రిలో రోడ్డు ప్రమాదానికి గురై.. ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ ప్రియాంక అంత్యక్రియలు.. ఆమె స్వగ్రామైన ఎక్లాస్‌పూర్‌లో ముగిశాయి. కన్నబిడ్డను విగతజీవిగా చూసి ఆ తల్లిదండ్రులు పడిన వేదన.. అందరి గుండెలను పిండేసింది.
పదికాలాల పాటు బతికి, నలుగురికి ప్రాణం పోయాల్సిన ప్రియాంక.. తాగుబోతుల రాక్షసత్వానికి నేలరాలిపోవడం.. కుటుంబసభ్యులను, గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మద్యం మత్తులో రాక్షసులుగా ప్రవర్తించిన ఇద్దరు యువకుల వల్ల.. ఓ నిండు ప్రాణం బలైపోయింది. కష్టపడి డాక్టర్‌ను చేసి, తమ కళ్ల ముందే సంతోషంగా చూసుకోవాలనుకున్న ఆ అమ్మానాన్నల కలల్ని.. ఆ మందుబాబుల పైశాచికత్వం అడియాశలు చేసింది.
అమ్మాయి పట్ల కనీస కనికరం లేకుండా, కారును ఎక్కించేసి.. ఆ అమ్మాయిని పొట్టనబెట్టుకున్నారు. డాక్టర్ పట్టా చేతికందుకొని.. ఆస్పత్రిలో రోగులకు వైద్యం చేయాల్సిన ప్రియాంక.. తన కల నెరవేరకుండానే వెళ్లిపోయింది. ప్రియాంక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.20 లక్షల పరిహారం ఇచ్చింది.
Also Read: మెడికో ప్రియాంక మృతి.. సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు!
అంత్యక్రియలు ముగిసినా.. ఆ తల్లిదండ్రుల గుండెల్లో రగులుతున్న మంట మాత్రం ఎప్పటికీ ఆరదు. సమాజంలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ, రాక్షసులుగా ప్రవర్తించే వాళ్లకు కఠినమైన శిక్ష పడితేనే గానీ.. ఇలాంటి ప్రియాంకల ప్రాణాలు పోకుండా ఆపలేం.