AP Education Schemes: సమ్మర్ హాలిడేస్ ముగిసే సమయం ఆసన్నమైంది. ఇక బడి గంట మోగేందుకు సిద్ధమవుతోంది. అయితే విద్యార్థులు ఇక విఐపీలుగా మారే సమయం వచ్చింది. ఈ పరిస్థితి ఎక్కడో కాదు ఏపీలోనే. ఇప్పటికే ఏపీ పాఠశాల విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్య బలోపేతానికి ఎన్నో చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే విద్యార్థులు ఈసారి విద్యా సంవత్సరంలోనే భారీ కానుకను పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తల్లికి వందనం స్కీమ్ ను అందిస్తున్న ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇక కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల్లా కనిపించే చర్యలు తీసుకుంది. అయితే అందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే, ఈ కథనం పూర్తిగా చదవండి.
సూపర్ స్కీమ్.. విద్యార్థులు బిగ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరో కీలకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ (SRKVM) పేరిట ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ అవసరమైన చదువు సామగ్రిని ఉచితంగా అందించనుంది. ఈ పథకాన్ని ప్రభుత్వం 2024లోనే ప్రకటించింది. పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం జూన్ 12, 2025న పునఃప్రారంభం అవుతుండగా, అదే రోజు నుండి విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు.
అదిరేటి డ్రెస్..
ఈ విద్యార్థి మిత్ర కిట్స్ లో 3 జతల యూనిఫాం క్లాత్, సిమెంట్ కలర్ ప్యాంట్, లైట్ బిస్కెట్ చెక్స్ చొక్కాతో కూడిన కొత్త డిజైన్, ప్రత్యేక బెల్టు, ఆకర్షణీయమైన బ్యాగ్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్, నోటుబుక్స్ 8 నుంచి 14 వరకు, అలాగే డిక్షనరీలు కూడా ఉండబోతున్నాయి. 1వ తరగతికి పిక్టోరియల్ డిక్షనరీ, 6వ తరగతికి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఇవ్వనున్నారు.
ఖర్చయినా.. విద్యాభివృద్ధి కోసం..
ప్రతి విద్యార్థిపై సుమారు రూ.1858 ఖర్చు అవుతుందని అంచనా వేయబడినప్పటికీ, విద్యార్థులకు ఏ మాత్రం ఖర్చు లేకుండా ప్రభుత్వం పూర్తిగా దీనిని భరిస్తోంది. అంతేకాదు, యూనిఫాం కుట్టించుకునేందుకు కూడా ప్రత్యేకంగా డబ్బు మంజూరు చేస్తోంది. 1వ తరగతి నుంచి 8వ తరగతివారికి రూ.120, 9వ తరగతి నుంచి 10వ తరగతివారికి రూ. 240 అందించనుంది. ఈ పథకం ప్రధానంగా పాఠశాలల్లో డ్రాపౌట్‌లు తగ్గించడానికి, విద్యార్థులలో చదువుపై ఆసక్తిని పెంపొందించడానికి, ఫలితాల్లో మెరుగుదల సాధించడానికి దోహదపడుతుంది.
Also Read: Tirumala Alipiri: అలిపిరి మెట్ల మార్గంలో… గడ్డిపోచ కదిలినా ఇక రికార్డే!
స్కీమ్ ప్రత్యేకత ఇదే..
ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది అన్ని విద్యార్థులకు, వారి మతం, కులం, సామాజిక స్థితిగతులు ఏవైనా సరే సమానంగా వర్తిస్తుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ కిట్లు అందుతాయి. ఈసారి యూనిఫాం డిజైన్‌లోనూ ముఖ్యమైన మార్పులు చేశారు. ఇంతకు ముందు పాలిటికల్ కలర్స్ ఉండే యూనిఫారాలను తొలగించి, తటస్థంగా మంచి లుక్ ఉండే విధంగా సరికొత్త డిజైన్ ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం అంటోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ డిజైన్‌ను అధికారికంగా ప్రకటించారు. దీనివల్ల విద్యార్థుల్లో గౌరవ భావన పెరిగి, చదువుపై మరింత ఆసక్తి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఓపెనింగ్ రోజే గిఫ్ట్..
ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి విద్యాశాఖ ఇప్పటికే జిల్లాల విద్యా అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పాఠశాలలు ఓపెన్ అయ్యే రోజే కిట్లు అందేలా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కిట్లు విద్యార్థులకు ఒకరకంగా ప్రేరణగా మారి, వారిలో విద్యపై ఆసక్తిని పెంచి, చదువు యొక్క విలువను తెలియజేసేలా ఉంటాయని భావిస్తున్నారు. చదువు కేవలం ఓ హక్కుగా కాకుండా, గౌరవంగా మారేలా, కార్పొరేట్ స్థాయి విద్యను చేరువ చేసేలా చేస్తుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. మరి విద్యార్థులూ.. పాఠశాలల ఓపెనింగ్ రోజు ఈ గిఫ్ట్ తీసుకోవడం మరచిపోవద్దు.