Andhra Woman In Kuwait Torture| ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం కువైట్ దేశానికి వెళ్లగా.. యజమాని తనను వేధిస్తున్నాడని గదిలో బంధించి తనను మరొకరికి అమ్మేస్తున్నట్లు చెప్పాడని ఆమె ఫిర్యాదు చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ అన్నమయ్య జిల్లా (ఉమ్మడి కడప, రాయచోటి)కు చెందిన కవితకు కొనేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె భర్త ఇటీవల అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో కవిత తన కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగం చేయలానుకుంది. అందుకోసం ప్రయత్నిస్తూ ఉండగా.. తనకు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం ఇప్పించే ఏజెంట్ పరిచయమయ్యాడు.
ఆ ఏజెంట్ ద్వారా కవిత కువైట్ దేశంలో ఉద్యోగం చేసేందుకు వీసా వచ్చింది. అందుకోసం ఆ ఏజెంట్ కు డబ్బులు కూడా చెల్లించింది. కానీ కువైట్ లో ఆమె వెళ్లాక అక్కడ పరిస్థితులు చూసి కవిత భయపడిపోయింది. తనకు చెప్పిన పని వేరు ఇక్కడ చేయిస్తున్న పనివేరని ఆమె తిరిగి వెళ్లిపోతానని చెప్పింది. దీంతో ఆ కువైట్ యజమాని ఆమెను బలవంతంగా పనిచేయించేవాడు. సరిగా తిండి కూడా ఇచ్చేవాడు కాదు. ఇదంతా చూసి కవిత ఇక పనిచేయనని తెగేసి చెప్పింది.
Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..
ఆ కువైట్ యజమాని ఆమెను కోపంతో గదిలో బంధించి.. ఇక తనను ఇతరులకు అమ్మేస్తానని చెప్పాడు. రెండు రోజులుగా గదిలో నుంచి బయటికి రానివ్వలేదు. భోజనం కూడా ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో కవితకు ఎలాగో ఫోన్ లభించింది. ఆమె తన ఏజెంట్ ని కాల్ చేసి విషయం వివరించింది. కానీ ఆ ఏజెంట్ ఆమెను అక్కడే ఉండి కువైట్ యజమాని చెప్పినట్లు చేయాల్సిందేనని ఎదురు చెప్పాడు. అప్పుడు కవితకు తాను మోసపోయానని అర్థమైంది. ఆ తరువాత వెంటనే తన బంధువులకు వీడియో కాల్ చేసి జరిగినదంతా చెప్పింది.
ఈ విషయం ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వరకు చేరింది. బాధితురాలిని సాయం చేసేందుకు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి.. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు రాతపూర్వకంగా తెలియజేశారు. కవితను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావాలని కేంద్ర మంత్రిని కోరారు.
గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం కోసం వెళుతున్న చాలామంది భారతీయులు, శ్రీ లంక వాసులు ఇలా ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఇతర దేశాలకు ఉద్యోగాలకు వెళ్లే భారతీయులను హెచ్చరించింది. వీసా వచ్చాక అన్ని విషయాలు ధృవీకరించుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.
Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!