తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి నడకదారిలో లక్ష్మీనరసింహాస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో వచ్చి చిక్కింది. ఆపరేషన్ చిరుత చేపట్టిన టీటీడీ అధికారులు గతంలోనే 5 చిరుతలను బంధించారు. తాజాగా మరో చిరుత చిక్కడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.
తిరుమలకు నడిచి వెళ్లే భక్తులను కొంతకాలంగా చిరుతలు హడలెత్తిస్తున్నాయి. కౌశిక్ అనే బాలుడిపై చిరుత దాడి చేసింది. చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందింది. ఈ ఘటనల తర్వాత అప్రమత్తమైన టీటీడీ, ఫారెస్ట్ అధికారులు చిరుతలను బంధించేందుకు ఆపరేషన్ చిరుత చేపట్టారు.
జూన్ 23న అలిపిరి నడకమార్గంలో 7వ మైలుకు సమీపంలో ఓ చిరుతను బంధించారు. ఆ తర్వాత ఆగస్టు 14న మరో చిరుత వచ్చి చిక్కింది. అదే నెల 17న మూడో చిరుత 28న 4వ చిరుతను బంధించారు. ఒకే నెలలో మొత్తం 3 చిరుతలు చిక్కేసరికి భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇక సెప్టెంబర్ 7న కూడా అధికారులు ఏర్పాటు చేసిన బోనుకి మరో చిరుత చిక్కింది. ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత సంచారాలను గుర్తించి 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం మధ్యలోని అటవీ ప్రాంతంలో 9 బోనులను అధికారులు ఏర్పాటు చేశారు. అనుకున్నట్టుగానే నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కడంతో ఇప్పటి వరకూ చిక్కిన చిరుతల సంఖ్య 6కు చేరింది.
అయితే లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. బంధించిన చిరుతల్లో రెండు చిరుతలు లక్షితపై దాడి చేసినవి ఇప్పటికే నిర్ధారించారు. వాటిని అటవీ ప్రాంతంలో వదిలివేశారు. మరో రెండు చిరుతల రిపోర్ట్ కోసం వేచిచూస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. తాజాగా చిక్కిన మరో చిరుత నమూనాను కూడా ల్యాబ్‌కు పంపుతారు.