Rajahmundry News: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ఎక్కడ? జాడ కనిపించిందా? తెలుగు రాష్ట్రాల పోలీసులు నిందితుడి కోసం జల్లెడ పడుతున్నారా? ఇంతకీ ఎటు వెళ్లాడు? ఆ మూడు ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారా? ఇంతకీ జైలులో బత్తుల ప్రభాకర్ ఎలా వ్యవహరించేవాడు? అక్కడ దిన చర్య ఏంటి అన్నదానిపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల చెర నుంచి తప్పించుకున్న క్రిమినల్ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా బత్తుల ప్రభాకర్ ఉండేవాడు. విజయవాడ నుంచి రాజమండ్రికి తీసుకొస్తున్న క్రమంలో దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద పోలీసు వాహనం నుంచి తప్పించుకున్నాడు. జైలులో ఉన్న బత్తుల స్నేహితుడి సమాచారంతో విచారణ చేపట్టారు పోలీసులు.
జైలులో ఉన్న సమయంలో ప్రభాకర్ ఎవరితోనూ క్లోజ్‌గా ఉండేవాడు కాదట. ప్రతీరోజూ జైలులో వ్యాయామం చేసేవాడు, అంతేకాదు 5 కిలోమీటర్లను సునాయాసంగా పరుగు తీసే శక్తి ఉందని సమాచారం. మంగళవారం ఉదయం పోలీసు జాగిలాలు దుద్దుకూరు నుంచి చిట్యాల హైవే పైకి వచ్చి ఆగిపోయింది. అక్కడి నుంచి పంట పొలాల మీదుగా రోడ్డుపై చేరుకునే అవకాశముంది.
అక్కడి నుంచి ఏదైనా వాహనంలో విశాఖ, విజయవాడ, ఖమ్మం వైపు వెళ్లి ఉంటాడని పోలీసులు ఓ అంచనా వచ్చారు. ఖమ్మం వైపు తెలంగాణ పోలీసులు గాలింపు చేపట్టినట్టు తెలుస్తోంది. బత్తుల ప్రభాకర్‌పై ఐదు రాష్ట్రాల్లో 80కి పైగా కేసులున్నాయి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో రెండు కేసులున్నాయి.
ALSO READ: సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు లీగల్ నోటీసు
రెండేళ్ల కిందట ఓ కళాశాలలో రూ.30 లక్షలు, దేవరపల్లి పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రూ.3 లక్షలు అపహరించిన కేసులు అతడపై ఉన్నాయి. ఈ కేసుల విషయమై తణుకు న్యాయస్థానానికి తీసుకెళ్తున్నారు పోలీసులు. క్లోజ్డ్ వాహనంలో చేతికి సంకెళ్లు వేసి బత్తులను తరలించారు. అక్కడి నుంచి సోమవారం విజయవాడకు ఇద్దరు గంజాయి నిందితులతోపాటు ప్రభాకర్‌ను తీసుకెళ్లారు.
ప్రభాకర్‌కు ఇద్దరు సిబ్బందిని ఎస్కార్ట్ ఏర్పాటు చేయడంపై అనేక అనుమానాలు మొదలయ్యాయి. ప్రభాకర్‌పై రాయలసీమ, నెల్లూరు, విజయవాడ, విశాఖ జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. సోమవారం పోలీసుల కళ్లు గప్పి పొలాల నుంచి వైళ్లినట్టు భావిస్తున్నారు. ఎస్కార్ట్ సిబ్బంది అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
ఈలోగా ప్రత్యేక బృందాలు ఎస్కేప్ అయిన ప్రాంతానికి చేరుకునేసరికి దాదాపు గంటకు పైగా పట్టిందని తెలుస్తోంది. ఈ లెక్కన బత్తుల తప్పించుకునేందుకు చాలా సమయం లభించిందని అంటున్నారు. ఏదైనా రైలులో మిగతా రాష్ట్రాలకు వెళ్లినా ఆశ్చర్య పోనక్కర్లేదని అంటున్నారు.
ఏపీ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్న క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ప్రిజమ్ పబ్బు కాల్పుల కేసులో కీలక వ్యక్తి. ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు పాఠశాలలను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడేవాడు. వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపేవాడు. పబ్‌ల్లో తిరగడం, ఖరీదైన అపార్టుమెంట్‌లో ఉండేవాడు.
ఏడు నెలల కిందట ప్రిజమ్ పబ్‌లో ప్రభాకర్‌ను పట్టుకునే క్రమంలో పోలీసులపై అతడు కాల్పులు జరిపాడు. నిందితుడ్ని చాకచక్యంగా అరెస్టు చేశారు. రూ. 300 కోట్లు సంపాదించాలనేది ప్రభాకర్ అసలు టార్గెట్. అందుకోసం ఏమైనా చేసేవాడు కూడా. ప్రభాకర్ చోరీ చేస్తే తక్కువలో తక్కువ 10 లక్షలు ఉండేదని అంటున్నారు. గతంలో ప్రభాకర్ నుంచి 500కు పైగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు.