Amaravati News: ఏపీలో కూటమి సర్కార్‌ని ఇరుకున పెట్టేందుకు వైసీపీ ప్లాన్ చేసిందా? సీఎం చంద్రబాబుపై ఒక్కో అస్త్రాలను ఎక్కుపెడుతోందా? ఈ నేపథ్యంలో ఆ పోలీసు చేత ముఖ్యమంత్రికి లీగల్ నోటీసు ఇచ్చిందా? ఏకంగా ముఖ్యమంత్రికే సీఐ శంకరయ్య లీగల్ నోటీసు ఇవ్వటం ఏపీ వ్యాప్తంగా చర్చ మొదలైంది. అసలు మేటర్‌లోకి వెళ్తే..
ఎవరు ఈ శంకరయ్య? ఈ స్టోరీలోకి వెళ్తే.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్నారు. వివేకా కేసులో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో న్యాయవాది ధరణేశ్వరరెడ్డి ద్వారా ఈనెల 18న నోటీసులు ఇచ్చారు ఆ సీఐ.
వారం రోజుల తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన చంద్రబాబు, అసెంబ్లీలో వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని అందులో పేర్కొన్నారు. అలాగే తన ప్రతిష్ఠకు నష్టం కలిగించినందుకు దాదాపు కోటిన్నర వరకు పరిహారం చెల్లించాలని మరొక విషయాన్ని ప్రస్తావించారు. ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలచుకునే పనిలో పడింది వైసీపీ.
దీన్ని టార్గెట్ చూపించి సీఎం చంద్రబాబుపై అస్త్రాలు ఎక్కుపెట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం చంద్రబాబుకు నోటీసు ఇచ్చిన వ్యవహారం తెలియగానే వైసీపీలో కొందరు నేతలు షాకయ్యారు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు శంకరయ్య నోటీసు ఇచ్చారంటే కచ్చితంగా తమ పార్టీ ఉందని అనుకుంటున్నారు.
ALSO READ: తిరుమల శ్రీవారి సేవకులకు టీటీడీ శుభవార్త
వైసీపీ ప్లాన్ మామూలుగా లేదని ఆఫ్ ద రికార్డులో నేతలు చర్చించుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ తరహా నోటీసు ఇవ్వడం అధికారులను బెదిరించడానికేనని ఆ పార్టీ స్కెచ్ వేసిందని అంటున్నారు. శంకరయ్య నోటీసుపై మంగళవారం అసెంబ్లీ లాబీల్లో కూటమి నేతల మధ్య చిన్నపాటి చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
అసలు స్టోరీలోకి వెళ్తే.. సరిగ్గా ఆరేళ్ల కిందట అంటే 2019 మార్చిలో వివేకానందరెడ్డి హత్య జరిగింది. అప్పుడు పులివెందుల సీఐగా శంకరయ్య ఉన్నారు. ఆయన సమక్షంలో నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని టీడీపీ పలుమార్లు ఆరోపించింది. అంతేకాదు రక్తపు మరకలు కడిగేశారని చంద్రబాబు పలుమార్లు ఆరోపణలు గుప్పించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో సీఐ శంకరయ్యను సస్పెండ్ చేసింది.
ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తేసింది. వివేకా హత్యపై కేసు నమోదు చేయవద్దని ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన అనుచరులు తనను బెదిరించారని సీబీఐకి ముందు వాంగ్మూలం ఇచ్చారు శంకరయ్య. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించవద్దని, దానిపై గాయాలున్నాయని ఎవరికీ చెప్పొద్దని తనను భయపెట్టినట్టు కూడా ఆయన సీబీఐకి వివరించారు.
ఈ విషయాన్ని మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయడానికి రాకుండా తప్పించుకున్నాడు. నిందితులు ప్రభావితం చేయడంవల్ల శంకరయ్య మాట మార్చారని, ఇదే విషయాన్ని సీబీఐ న్యాయస్థానాల దృష్టికి తీసుకొచ్చింది. ఈ వ్యవహారం జరుగుతుండగానే సీఎం చంద్రబాబుకు శంకరయ్య నోటీసు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం శంకరయ్య కర్నూలు రేంజ్‌లో వీఆర్‌లో ఉన్న విషయం తెల్సిందే. వివేకా కేసు మళ్లీ విచారణ జరిపించాలని సునీత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ఒకవేళ మళ్లీ విచారణ చేపడితే శంకరయ్య కష్టాలు తప్పవని అంటున్నారు. మొత్తానికి వైసీపీ ఆడుతున్న రాజకీయ క్రీడలో శంకరయ్య ఎంటరయ్యారు. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.