Naatu Naatu Song – AP Assembly Session: అసెంబ్లీ సమావేశాల్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR సినిమా పేరు మార్మోగింది. అలాగే ఆ సినిమాలోని నాటు నాటు.. పాట కూడా అదే స్థాయిలో అసెంబ్లీ లో వినిపించింది. ఇంతకు అసెంబ్లీ లో ఈ సినిమా గోల ఏమిటని అనుకుంటున్నారా.. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మేల్యే రఘురామకృష్ణంరాజు ఎన్నికైన నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా చిరునవ్వులు చిందించారు సభ్యులు. ఇంతకు ఈ ఆసక్తికర కామెంట్స్ చేసింది ఎవరో కాదు సాక్షాత్తు సీఎం చంద్రబాబు.
నువ్వు చంపాలని చూశావు.. నేను హోదా కల్పించి గౌరవించా.. ఇది నీకు నాకు ఉన్న తేడా.. త్రిబుల్ ఆర్ సినిమా గుర్తుందిగా.. అందులో నాటు నాటు.. సాంగ్ వినే ఉంటావుగా.. అంత సంచలనం సృష్టించారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అంటూ మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు అన్నారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు ఎన్నిక కాగా, అసెంబ్లీలో త్రిబుల్ ఆర్ సినిమా పేరు మార్మోగింది. దీనికి కారణం రఘురామకృష్ణంరాజు కూడా త్రిబుల్ ఆర్ గా గుర్తింపు పొందారు. అందుకే సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సినిమా రంగంలో RRR సినిమా ఎంత సంచలనం సృష్టించిందో తెలుసుగా.. అదే స్థాయిలో రాజకీయాల్లో కూడా మా త్రిబుల్ ఆర్ సంచలనం సృష్టించారన్నారు. అంతటితో ఆగక నాటు నాటు పాట కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు, ఆ స్థాయిలో వాణి వినిపించారంటూ రఘురామకృష్ణంరాజును కొనియాడారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గురించి సీఎం కొనియాడుతున్నంత సేపు సభ్యుల నవ్వులే నవ్వులు సాగాయి. వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో ధిక్కార స్వరం వినిపించి రోజూ రచ్చబండ పేరిట, మాజీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా రఘురామ తన వాణి వినిపించేవారు. యూట్యూబ్ లో త్రిబుల్ ఆర్ విమర్శలకు వచ్చే వ్యూస్ ప్రభంజనం అని చెప్పవచ్చు.
ప్రతిరోజూ ఒంటి గంట నుండి 2 గంటల వరకు ఈ విమర్శల ప్రసంగం.. గోదావరి యాసలో సాగగా, స్పెషల్ ఫాలోయింగ్ కూడా రఘురామకృష్ణంరాజుకు ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే కాబోలు ఆ విమర్శలను దృష్టిలో ఉంచుకొని, సీఎం చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారని ఎమ్మేల్యేలు అభిప్రాయపడ్డారు.