AP Govt: రైతే రాజు.. రారాజు అనే మాటలు వినే ఉంటాం. అటువంటి రైతన్నలు సాగు కోసం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. సాగు సాగించాలంటే డబ్బు అవసరం. అదేనండీ పెట్టుబడులు. పెట్టుబడులు లేనిదే సాగు ముందుకు సాగదు. అధిక వడ్డీలకు డబ్బును రుణం రూపంలో తీసుకొనే రైతులు ఎందరో ఉన్నారు. అలాంటి రైతులకు సకాలంలో రుణ సదుపాయం కల్పించేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎందరో రైతులకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.
ఏపీలో రైతులకు మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ సాధించింది. ధాన్యం అమ్మిన 24 గంటల్లో రైతులకు నగదు జమ చేసిన ప్రభుత్వానికి రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో వీడియోలను కూడ పోస్ట్ చేశారు. ఇలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి ప్రభుత్వం రైతన్నలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు బ్యాంకర్ల సమావేశం నిర్వహించిన సమయంలో రైతన్నల కోసం కీలక ఆదేశాలు జారీ చేశారు.
రైతన్నలు తమ పెట్టుబడుల కోసం అప్పులు చేస్తుంటారు. అంతేకాదు అధిక వడ్డీలకు రైతన్నలు నగదు తెచ్చి, పంట చేతికి అందక పెట్టుబడి రాక పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇలా అప్పుల భారం ఎక్కువై ఎందరో రైతన్నలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడ ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం కూడ చేశారు. ఇలాంటి పరిస్థితి మరో రైతుకు రాకుండా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు సూచనలు చేసారు. అర్హులైన రైతులు లోన్ల కోసం బ్యాంకుకు వస్తే… పావుగంట లోగా రుణాలు ఇచ్చే విధానాన్ని అందుబాటులోకి తేవాలని బ్యాంకర్లను ఆయన కోరారు. అంటే రైతన్నలకు పావు గంటలో రుణం మంజూరు చేయాలని సీఎం కోరారు. ఇదే అమలైతే.. రైతన్నలకు అధిక వడ్డీల భారం తగ్గుముఖం పడుతుందని చెప్పవచ్చు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతన్నలు తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే బ్యాంకర్లు ఎట్టి పరిస్థితుల్లో రైతన్నలకు మేలు చేకూర్చేలా సహకరించాలని సీఎం కోరారు. ఈ నిర్ణయంతో ఏపీలోని రైతులకు మేలు చేకూరనుంది.
Also Read: Bird Flu: బర్డ్ ఫ్లూతో లక్షల్లో కోళ్ల మృత్యువాత.. మనుషులకు ఈ వైరస్ సోకుతుందా?
ప్రస్తుతం రైతన్నలు సాగు పద్దతిలో ఆధునిక పద్దతులను అవలంబిస్తున్నారు. ప్రధానంగా డ్రోన్ సాయంతో మందుల పిచికారి వంటి వాటిని తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాగుకు డ్రోన్ అవసరాలు ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. అందుకే ఎవరైనా డ్రోన్స్ కొనుగోళ్ల కోసం రుణాల కొరకు బ్యాంకులను సంప్రదిస్తే, తక్షణం మంజూరు చేయాలని కూడ సీఎం కోరారు. అంతేకాదు త్వరలో రైతన్నలకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందించే సాయంతో కలిపి రూ. 20 వేలు ఇచ్చేందుకు కూడ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడులు ఇద్దరూ ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. కాగా కేవలం అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.