ప్రజావేదిక కూల్చివేత. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అప్పటి సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం అది. ప్రజా వేదికను కూల్చేయడానికి ప్రధాన కారణం అది అక్రమ కట్టడం అని జగన్ చెప్పారు. ఆక్రమణల తొలగింపు ప్రజావేదిక నుంచే ప్రారంభం కావాలని జగన్, కలెక్టర్ల సమావేశంలో ఆదేశాలివ్వడంతో జేసీబీలతో దాన్ని కూల్చివేశారు. అయితే ఈ కూల్చివేతను వైసీపీ నేతలు కూడా ఎవరూ ఊహించలేదు. ఆక్రమణల తొలగింపు అనేది కేవలం పైకి చెబుతున్న మాట. కానీ చంద్రబాబు నిర్మాణాలేవీ కంటికి కనిపించకూడదనే దురుద్దేశంతోనే ఆయన ప్రజా వేదికను కూల్చేశారని టీడీపీ నేతలు అప్పట్లో ఆరోపించారు. ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ పతనం ప్రారంభమైందని చంద్రబాబు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నట్టుగానే ఐదేళ్లకు జగన్ పతనం జరిగింది. 151 సీట్ల భారీ మెజార్టీ నుంచి 11 సీట్లకు జగన్ పడిపోయారు. ఆ కూల్చివేతను గుర్తు చేస్తూ తాజాగా సీఎం చంద్రబాబు ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు.
#6YearsOfPrajaVedikaDemolition
దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు. నాడు సాగిన అరాచక, అప్రజాస్వామిక పాలన నేటికీ దేశంపై మానని గాయంగా మిగిలిపోయింది. అందుకే సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో 6 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రజావేదిక… pic.twitter.com/CS5ZKFqJmC— N Chandrababu Naidu (@ncbn) June 25, 2025
దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు అయిందని, నాడు సాగిన అరాచక, అప్రజాస్వామిక పాలన నేటికీ దేశంపై మానని గాయంగా మిగిలిపోయిందని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. ఆ రోజుల్ని గుర్తు చేస్తూ సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారాయన. అయితే ఆ ఎమర్జెన్సీ రోజులకు ఏపీలో ప్రజా వేదిక కూల్చివేత ఘటనను పోల్చి చెబుతూ చంద్రబాబు ట్వీట్ వేయడం ఇక్కడ విశేషం. ఏపీలో 6 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రజావేదికను గత ప్రభుత్వం కూల్చివేసిందని గుర్తు చేశారు చంద్రబాబు. ఆ ఘటనతోనే రాష్ట్రంలో విధ్వంస పాలనకు తొలి అడుగు పడిందన్నారు. ఎమర్జెన్సీని మించిన నియంతృత్వ పాలనకు జగన్ తెరలేపారన్నారు. ప్రజాస్వామ్యంలో నియంతలకు, విధ్వంసకారులకు చోటు లేదనే విషయాన్ని రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ప్రజలు నిరూపించారని గుర్తు చేశారు చంద్రబాబు. కూల్చివేతల పాలకులను కూల్చిన ప్రజలు… పునర్మిర్మాణ బాధ్యతను కూటమికి అప్పగించారన్నారు. కసి, పట్టుదలతో రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తున్నామని చెప్పారాయన. ప్రజావేదిక కూల్చివేతకు 6 ఏళ్లు అయిన సందర్భంగా నాటి ఘటనను గుర్తు తెచ్చుకుని… మరింత గట్టి సంకల్పంతో వికాసం వైపు ప్రయాణం చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజావేదిక కూల్చివేయడం కరెక్టా, కాదా అనే చర్చకు అంతులేదు. నిజంగానే ఆక్రమణలు తొలగించడం జగన్ ధ్యేయం అయితే, ఆయన హయాంలో ఎన్నెన్ని ఆక్రమణలో జరిగాయి, మరి వాటి సంగతేంటి అని వైరి వర్గాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. కరకట్టను ఆక్రమించి కట్టారని ప్రజావేదికను కూలదోయించిన జగన్, రుషికొండకు గుండుకొట్టించి మరీ అక్కడ ప్యాలెస్ కట్టారు కదా, దానిసంగతేంటి అని ఆ తర్వాత ప్రజలు వైసీపీ నేతల్ని నిలదీశారు. ఆ ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. అందుకే గత ఎన్నికల్లో వైసీపీకి అలాంటి తీర్పు వచ్చింది. కూల్చివేతల వల్ల, ప్రతీకార చర్యల వల్ల నాయకుల్లో అహం చల్లారవచ్చు కానీ, దీర్ఘకాలంలో అది వ్యక్తిగతంగా వారికి, పార్టీకి ఏమాత్రం మంచిది కాదని చరిత్ర చెబుతోంది. దీనికి నిదర్శనమే ప్రజావేదిక కూల్చివేత.