AP Free Bus: ఏపీలో ఈరోజు నుంచి మహిళలకు నిజంగానే పండుగ రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా స్త్రీశక్తి పథకం కింద మహిళలు ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ప్రారంభమైంది. ఉదయం నుంచి బస్సు స్టాండ్లలో హడావుడిగా మహిళలు, బాలికలు బస్సుల్లో ఎక్కుతూ జీరో టికెట్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఇదే సందర్భంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఆర్టీసీ బస్సులో స్వయంగా ప్రయాణించి పథకం ప్రారంభానికి ప్రత్యేకతను చేకూర్చారు.
ఉండవల్లి నుంచి విజయవాడ నెహ్రూ స్టేషన్ వరకు
స్త్రీశక్తి పథకం ప్రారంభోత్సవం అనంతరం, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఉండవల్లిలో ఆర్టీసీ బస్సులో ఎక్కి, విజయవాడ నెహ్రూ బస్ స్టేషన్ వరకు ప్రయాణించారు. ఇది చూసిన ప్రజలు ఆనందంతో వారిని చుట్టుముట్టి ఫోటోలు, వీడియోలు తీశారు. బస్సులో పక్క సీట్లలో కూర్చున్న ప్రయాణికులతో వారు మాట్లాడి, పథకం వల్ల కలిగే లాభాల గురించి ఆరా తీశారు. సాధారణ ప్రయాణికుల్లా టికెట్ కౌంటర్ వద్ద ‘జీరో టికెట్’ తీసుకోవడం మరింత ఆకర్షణగా మారింది.
ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ!
ఈ స్త్రీశక్తి పథకం కింద మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఈ పథకంలో ఉన్నాయి. మహిళలు తమ ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, లేదా రేషన్ కార్డు చూపిస్తే చాలు.. టికెట్ కౌంటర్లలో, కండక్టర్స్ ‘జీరో టికెట్’ ఇస్తారు.
8,458 బస్సులు సిద్ధం
ఈ పథకాన్ని విజయవంతం చేయడానికి ఆర్టీసీ మొత్తం 8,458 బస్సులను వినియోగిస్తోంది. అన్ని డిపోల నుంచి ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తూ, ఎక్కడా రద్దీ వల్ల అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే.. ఎన్టీఆరో భరోసా పెన్షన్ల పెంపుతో పాటు సూపర్ సిక్స్ పథకాల్లో.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉపాధి అవకాశాల కల్పన, దీపం పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు.. స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయనుంది. ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. ఏటా కోటీ 42 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీ ఆర్టీసీలో ఉన్న 11 వేల 449 బస్సుల్లో.. 8 వేల 458 బస్సుల్లో స్త్రీ శక్తి పథకం కింద ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో.. మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు.
Also Read: AP weather alert: తీరప్రాంతంలో టెన్షన్ టెన్షన్.. 24 గంటల్లో అక్కడ దంచుడే!
జీరో టికెట్ నిబంధనలు
ఎక్కడికైనా ప్రయాణించాలంటే, బస్సులో ఎక్కిన వెంటనే కండక్టర్ దగ్గర ‘జీరో టికెట్’ తీసుకోవాలి. ప్రయాణం మధ్యలో టికెట్ పొడిగించుకోవాలనుకుంటే, మరోసారి ‘జీరో టికెట్’ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సౌకర్యం కేవలం పైన పేర్కొన్న ఐదు రకాల బస్సులకు మాత్రమే వర్తిస్తుంది.
ప్రయాణికుల స్పందన
చాలా మంది మహిళలు ఈ పథకం వల్ల తమ ఖర్చు తగ్గి, రోజువారీ పనులు సులభం అవుతాయని చెబుతున్నారు. విద్యార్థినులు, ఉద్యోగినులు, మార్కెట్‌కి వెళ్లే మహిళలు ఈ పథకంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఆర్థిక భారం తగ్గించడం, సులభమైన రవాణా సదుపాయం అందించడం ఈ పథకానికి ప్రధాన ఉద్దేశం. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “మహిళల శక్తి రాష్ట్ర అభివృద్ధికి పునాది. ఈ సౌకర్యం ప్రతి ఇంటికి ఉపశమనం ఇస్తుంది” అని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా, “ఇది కేవలం ఫ్రీ ట్రావెల్ కాదు… ఇది మహిళల స్వేచ్ఛకు చిహ్నం” అని అభిప్రాయపడ్డారు.