Free bus scheme: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఓ చక్కని స్వేచ్ఛ దక్కబోతోంది. పొద్దున్న బయటకి వస్తే.. బస్సు ఎక్కాలనిపిస్తే.. టికెట్ విషయంలో ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఏపీలో అమలు కానున్నది.. మహిళల ఉచిత బస్సు పథకం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటూ మహిళలకు నిజమైన ప్రయాణ స్వాతంత్ర్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. టికెట్ లేదు!
ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించాలన్నా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూరి సన్నాహాలు పూర్తిచేసింది. మొదటి విడతగా 6,700 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి తరగతులు ఉన్నాయి. అంటే ఒకే రూల్.. ఈ కేటగిరీలో ఉన్న బస్సుల్లో ప్రయాణించండి, టికెట్ అడగరు!
ప్రతి రూపాయి ప్రజలకే… ఖర్చు ఏటా రూ.1,950 కోట్లు
ఉచిత ప్రయాణం అంటే ఖర్చు లేనట్టు కాదు. ప్రభుత్వం మాత్రం బడ్జెట్ మీద భారీ భారం వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఏటా రూ.1,950 కోట్లు ఖర్చు చేస్తూ.. రాష్ట్రంలోని మహిళల ప్రయాణ భద్రత, ఆర్థిక స్వేచ్ఛ కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇది ఓ పెట్టుబడి లాంటిది.. మహిళల అభివృద్ధిలో పెట్టే పెట్టుబడి!
ముగ్గురు మంత్రుల అధ్యయన యాత్ర
ముగ్గురు మంత్రులతో కలిసి మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకి వెళ్లారు. అక్కడ ఉచిత బస్సు పథకం ఎలా అమలవుతోంది? ప్రజలకు ఏమవుతుంది? ప్రభుత్వం ఎలా నడుపుతోంది? అన్నీ తెలుసుకున్నారు. ఆ అనుభవాన్ని మిక్స్ చేసి, ఏపీలో మరింత మెరుగ్గా అమలు చేయాలన్న లక్ష్యంతో పథకాన్ని రూపొందించారు.
బస్టాండ్లు కూడా కొత్తగా మారనున్నాయి
బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తున్నామంటే.. బస్టాండ్లు అలాగే వదిలేస్తారా? ఖచ్చితంగా కాదు అంటోంది ప్రభుత్వం. బస్టాప్‌లు, బస్టాండ్లలో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కుర్చీలు, ఫ్యాన్‌లు, పెయింటింగ్స్, మరమ్మతులు.. అన్నీ బస్టాండ్‌లో కనిపించేలా మార్పులు తెస్తున్నారు. ప్రయాణం సులభంగా ఉండాలి, తలుపు వద్దే ఆగిపోయే భయం లేకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచన.
Also Read: AP Highway Projects: అమెరికాను క్రాస్ చేస్తున్న ఏపీ రోడ్లు.. ఇక్కడే బెటర్ ఎందుకంటే?
ఎలక్ట్రిక్ బస్సులదే భవిష్యత్!
ఉచిత ప్రయాణం ఇవ్వడమే కాదు.. భవిష్యత్ దృష్టితో ఎలక్ట్రిక్ బస్సులను APSRTCలో చేర్చనున్నారు. దీని వల్ల పర్యావరణంపై ప్రభావం తక్కువగా ఉండటంతో పాటు, నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. దీంతో ఎక్కువ బస్సులు, ఎక్కువ సర్వీసులు ఇవ్వడానికీ అవకాశం ఉంటుంది. మహిళలకు ప్రయాణ సౌలభ్యం, రాష్ట్రానికి గ్రీన్ ఫ్యూచర్.
త్రిసభ్య కమిటీ నిర్ణయం..
ఈ పథకం అమలు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అన్ని అంశాలు సమీక్షించి నిర్ణయం తీసుకుంది. ఇక ఆసక్తికర విషయం ఏంటంటే.. తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఉన్న ఉచిత బస్సు పథకాలను ఆధారంగా తీసుకుని, మరింత సమగ్రంగా ఏపీలో అమలు చేయనున్నారు. అక్కడ కనిపించిన లోపాలను ఇక్కడ రాకుండా చూసే విధంగా ఏర్పాట్లు చేశారు.
మహిళలకు ఇది ఓ ప్రయాణం కాదు… మార్పు ప్రారంభం!
ఉచిత బస్సు పథకం అంటే కేవలం ప్రయాణానికి ఓ సదుపాయం మాత్రమే కాదు. ఇది మహిళల కోసం అందించబోయే స్వేచ్ఛ, భద్రత, అభివృద్ధికి దారి తీసే మార్గం. ఉద్యోగం కోసం బయటికి వెళ్ళే అమ్మాయికి, డిగ్రీకి కాలేజీకి వెళ్ళే విద్యార్థినికి, మార్కెట్‌కి వెళ్ళే మహిళలకు ప్రతి ఒక్కరికీ ఇది చక్కని అవకాశంగా మారనుంది.
ఫైనల్ మెసేజ్.. టికెట్ లేకపోయినా హక్కు ఉంది!
ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి బస్సు ఎక్కేటప్పుడు మీ చేతిలో టికెట్ లేకపోయినా గుండెల్లో ఓ గర్వం ఉంటుంది. అది హక్కుగా వచ్చిన ప్రయాణ స్వేచ్ఛ గర్వం. ఇక ఏపీలో మహిళలకు బస్సు టికెట్ తీసుకోవాల్సిన రోజులు పోయాయి. ప్రయాణానికి రెడీ అయితే చాలు.. ప్రభుత్వం టికెట్ తానుగా వేస్తోంది!