AP Patta Books: ఎన్నికల హామీలను వేగంగా అమలు చేసేందుకు దృష్టి సారించింది చంద్రబాబు సర్కార్. సర్వే పూర్తి చేసిన భూ యజమానులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఆగస్టు నుంచి ప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే ఇల్లు లేని పేదల స్థలాల పంపిణీ విషయంలో ఓ అడుగు ముందుకేసింది. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు చొప్పున స్థలాలు మంజూరు చేయనుంది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. గ్రామాలలో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకుంటున్నారు. శనివారం నుంచి ఆన్‌లైన్ విధానం అమల్లోకి వచ్చింది. అర్హులైన వారంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోనున్నారు.
ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రజలు ఆధార్, రేషన్ కార్డులు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో తీసుకుని గ్రామ సచివాలయాన్ని సంప్రదించాలి. సచివాలయం సిబ్బందికి వివరాలు అందించి దరఖాస్తు తీసుకుంటారు. వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాల్లో చాలామంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో ఈసారి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.
గతంలో ఇళ్ల స్థలాలు పొందినవారు, ఇల్లు నిర్మించని లబ్ధిదారులకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం ద్వారా పేదలకు లబ్ధి చేకూర్చాలని భావిస్తోంది. అవసరమైతే కొత్త భూములను సేకరించాలని ఆలోచన చేస్తోంది. ఇదిలాఉండగా టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల కోసం ఓ నిర్ణయం తీసుకుంది. వచ్చే సంక్రాంతికి టిడ్కో ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయించాలని భావిస్తోంది. దీనివల్ల లక్షలాది మందికి నివాస సదుపాయం కలగనుంది.
ఇళ్ల స్థలాలు, ఇళ్లకు సంబంధించివాటిపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఆగస్టు నుంచి ప్రజలకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబుతో జరిగిన రెవిన్యూ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. తొలివిడత 21 లక్షల మందికి పైగానే పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వనుంది. కొత్త పాస్ పుస్తకాలు టెక్నాలజీతో ముడిపడి ఉంటాయి.
ALSO READ: విచారణకు మాజీ మంత్రి నారాయణస్వామి డుమ్మా, మరోసారి నోటీసులు?
పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్ ఉండనుంది. భూ యజమాని కోడ్‌ని స్కాన్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి. దీనివల్ల భూ యజమాని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డుతో భూమి పూర్తి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. తమ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని భూ యజమానులు తెలపాలి. ఈ పాస్ పుస్తకాల ద్వారా ప్రజల భూములకు మరింత సెక్యూరిటీ ఉంటుంది.
ఇకపై కబ్జాలకు బ్రేక్ పడడం ఖాయం. అక్టోబర్ నాటికి ఫ్రీ హోల్డ్ అంశానికి పూర్తి పరిష్కారం చూపాలన్నది ప్రభుత్వ ఆలోచన. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇక్కడ ఫ్రీ హోల్డ్ అంటే ఒక ఆస్తికి సంబంధించి పూర్తి యాజమాని హక్కు. దాని నిర్మాణాలపై హక్కులు ఉంటాయి. లీజ్‌హోల్డ్‌తో పోలిస్తే.. ఫ్రీహోల్డ్‌కి సమయ పరిమితి ఉండదు. యజమాని ఆస్తిని శాశ్వతంగా సొంతం చేసుకోవచ్చు. అమ్ముకోవచ్చు లేదంటే సవరించవచ్చు.వారసత్వంగా వచ్చే భూములను పంచుకునే విషయంలో రూ.100 చెల్లించి సక్సెషన్ చేసుకోవచ్చు.