20మంది టీడీపీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు కాబోతున్నాయని, వారిపై చంద్రబాబు క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతున్నారని వైసీపీ అనుకూల మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని టీడీపీ వర్గాలంటున్నాయి. ఎలాగైనా కూటమిలో కుంపటి పెట్టాలని వైసీపీ ఆలోచించడం చూస్తూనే ఉన్నాం. జనసేన-టీడీపీ మధ్య గొడవలు రావాలని నాగబాబు వ్యాఖ్యల్ని హైలైట్ చేయడం, దానికి ప్రతిగా కొంతమంది చోటామోటా టీడీపీ నాయకులతో మాట్లాడించడం గమనిస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో 20మంది టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలంటూ మరో లీకు బయటకు వదిలారు. ఇంతకీ ఈ లీకు ఎక్కడినుంచి వచ్చింది, వారి టార్గెట్ ఏంటి అనేది తేలాల్సి ఉంది.
ఏపీలో కూటమి ప్రజా ప్రతినిధులలో కొందరు అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీలు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారట. నిఘా వర్గాల ద్వారా ఈ నివేదికలు చంద్రబాబు వద్దకు వచ్చాయ. దీంతో ఆయన వారిని పిలిపించి మందలించారట, ఘాటుగా హెచ్చరికలు కూడా జారీ చేశారట. అయినా కూడా వారిలో మార్పు రాకపోవడంతో 20మంది ఎమ్మెల్యేలపై కేసులు పెట్టాలని ఫిక్స్ అయ్యారట. ఇలా కొనసాగింది వైసీపీ అనుకూల మీడియా కథనం. అంతే కాదు.. ఏయే జిల్లాల్లో ఎంతమంది అనే లెక్క కూడా ఆ స్టోరీలో రాసుకొచ్చారు. తిరుపతి జిల్లాలో ఇద్దరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఐదుగురు అంటూ లెక్కలు కూడా ఇచ్చేశారు. అయితే వారి పేర్లు మాత్రం బయటపెట్టలేదు. మొత్తమ్మీద ఇలా ఓ కథనం బయటపెట్టి కొంతమంది ఎమ్మెల్యేలలో అలజడి రేపాలనేది వారి ప్లాన్ అని స్పష్టమవుతోంది.
సొంత పార్టీ ప్రజా ప్రతినిధులపై కేసు పెడితే చంద్రబాబుకి అది ప్లస్ అవుతుందని, అందుకే ఆయన ఆ చర్యలకు పూనుకుంటున్నాడని కూడా వైసీపీ అనుకూల మీడియా కథనాలిస్తోంది. అయితే ఉన్నట్టుండి చంద్రబాబు అలాంటి నిర్ణయం తీసుకుంటారా..? అసలు ఆ స్థాయిలో సీరియస్ నిర్ణయం తీసుకునేంత పెద్ద తప్పులు 20మంది ఎమ్మెల్యేలు చేశారా అనేది అసలు పాయింట్.
గతంలో కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొంతమందిని నేరుగా ఆయన పిలిపించుకుని మాట్లాడారు. ఇకపై అలా ప్రవర్తించొద్దని హెచ్చరించారు కూడా. ఇటీవల ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ విషయంలో కూడా ఇలాగే గొడవ ముదిరి చివరకు రాజీనామాల వరకు వెళ్లింది. పార్టీ అంతర్గత వ్యవహారాలను పక్కనపెడితే.. ఈ విషయాలపై వైసీపీ ఆసక్తి చూపించడం విశేషం. ఇటీవల నాగబాబు వ్యాఖ్యల్ని కూడా వైసీపీ అనుకూల మీడియా విపరీతంగా వైరల్ చేస్తోంది. అదే సమయంలో ఇరు పార్టీల్లో ఎవరైనా కాస్త కాంట్రవర్సీగా మాట్లాడినా అది వైసీపీ మీడియాకి పండగలా మారుతోంది.
ఏపీలో టీడీపీ-జనసేన కలసి ఉంటే ఆ కాంబినేషన్ ని తట్టుకోవడం కష్టమని వైసీపీకి అర్థమవుతోంది. అందుకే ఆ రెండు పార్టీలు విడిపోతే.. మధ్యలో పబ్బం గడుపుకోడానికి వైసీపీ రెడీగా ఉంది. కానీ కూటమిని కూలదోయడం అంత ఈజీ కాదని అంటున్నారు టీడీపీ, జనసేన నేతలు. సోషల్ మీడియాలో రచ్చ చేసినంత మాత్రాన అధినేతల మధ్య మనస్పర్థలు రావని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుల వ్యవహారం కూడా ఫేక్ ప్రాపగాండా అంటున్నారు టీడీపీ నేతలు.