Big Stories

AP: చంద్రబాబు, లోకేశ్‌ల అరెస్ట్ తప్పదా? సజ్జల వార్నింగ్ అందుకేనా?

AP: “దేశ చరిత్రలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్‌ అమరావతి.. లైఫ్ టైమ్‌ సంపాదన కోసం చంద్రబాబు ప్రయత్నించారు.. సిట్ దర్యాప్తులో అన్నీ బయటకొస్తాయి.. అవినీతి మొత్తం బయటకు తీస్తాం.. అరెస్టులు కూడా జరుగుతాయి”.. ఇవీ ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన వ్యాఖ్యలు. ఆయన తనదైన స్టైల్‌లో చాలా స్మూత్‌గా ఈ స్టేట్‌మెంట్ ఇచ్చినా.. ఆయన మాటలు ఏపీ పాలిటిక్స్‌లో రీసౌడ్ క్రియేట్ చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. ఇక చంద్రబాబు చిక్కినట్టేనని వైసీపీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది.

- Advertisement -

తప్పు చేయకపోతే చంద్రబాబుకు భయమెందుకని.. కోర్టులకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకుంటున్నారనేది సజ్జల ప్రశ్న. రియల్‌ ఎస్టేట్‌ స్కాంకు అమరావతి అని పేరు పెట్టారని అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలోనూ చంద్రబాబు హస్తం ఉందన్నారు. తాత్కాలిక నిర్మాణాల్లోనూ అవినీతికి పాల్పడ్డారని.. నిజనిజాలను బయటకు తీసేందుకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిందని చెప్పారు.

- Advertisement -

చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం, భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్టు వైసీపీ సర్కారు భావిస్తోంది. అక్రమాలపై 2019లో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసి.. నివేదికను అసెంబ్లీలో చర్చించారు. ఆ తర్వాత సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే.. ఆ సిట్‌ నియామకంపై టీడీపీ నేతలు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను సవాల్‌ చేస్తూ ఏపీ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. స్టే ను తొలగిస్తూ.. సిట్ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం.

మేటర్ చూస్తుంటే చంద్రబాబుకు పక్కాగా ఉచ్చు బిగిస్తున్నట్టే కనిపిస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ నివేదికలో అనేక సంచలన విషయాలు ఉన్నాయి. సిట్ సైతం అవే అంశాలపై ఎంక్వైరీ చేయనుంది. రాజధాని ప్రకటనపై ముందస్తు సమాచారంతో అమరావతి ఏరియాలో భారీగా భూములు కొన్నారని.. బినామీ పేర్లతో టీడీపీ నేతలు భూదందాకు పాల్పడినట్టు ఆ నివేదికలో తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై పక్కా ఆధారాలు ఉన్నాయంటోంది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరిగాయని.. 4 వేల 70 ఎకరాల భూములను టీడీపీ ప్రముఖులు ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొనుగోలు చేశారని అంటోంది.

చంద్రబాబు, నారా లోకేష్‌ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీఎస్‌ ఆంజనేయులు, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, లంకా దినకర్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ రావు, పుట్టా మహేష్ యాదవ్, చంద్రబాబు ఉంటున్న ఇంటి యజమాని లింగమనేని రమేష్ తదితరుల పేర్లను ఆ రిపోర్టులో ప్రస్తావించింది కేబినెట్ సబ్ కమిటీ.

ఇలా పక్కాగా టీడీపీ పెద్దలను టార్గెట్ చేసేలా గతంలో మంత్రిమండలి ఉప సంఘం నివేదిక ఇవ్వగా.. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో సిట్ సైతం అమరావతి ల్యాండ్ మైన్‌ను పేల్చేందుకు సిద్ధమవుతోంది. అదే జరిగితే.. ఎన్నికల ముందు సంచలన చర్యలూ ఉండే ఛాన్స్ ఉంది. సజ్జల చెబుతున్నట్టుగా అరెస్టులు జరుగుతాయా? చంద్రబాబు, లోకేశ్‌లనూ లోపలేస్తారా? ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చూస్తామా?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News