ASP: పోలీస్ అంటేనే మోస్ట్ ఛాలెంజింగ్ జాబ్. అధికారపార్టీకి తలొగ్గి పని చేస్తే సరే.. లేదంటే.. చుక్కలే. అందుకే, ఖాకీలు సైతం బాగా బతకడం నేర్చారు. ఎవరికి సెల్యూట్ కొట్టాలో.. ఎవరు చెప్పిన పని చేయాలో బాగా వంటపట్టించుకున్నారు. కొందరు పోలీసులు మాత్రం ఇప్పటికీ తాము నాలుగో సింహం అంటూ సిన్సియర్‌గా డ్యూటీ చేస్తుంటారు. అలాంటి వారు తక్కువ మందే ఉన్నా.. ఎప్పుడూ న్యూస్‌లో ఉంటుంటారు. లేటెస్ట్‌గా ఓ నిఖార్సైన ఖాకీకి.. అరుదైన ట్రాన్స్‌ఫర్ బహుమతిగా లభించింది. ఇంతకీ మేటర్ ఏంటంటే…
ఆదిరాజ్ రాణా. ఐపీఎస్ ఆఫీసర్. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ అడిషనల్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఓ మంచి రోజు చూసుకుని బాధ్యతలు స్వీకరించారు. సిబ్బంది అంతా శుభాకాంక్షలు చెబుతుండగానే.. షాకింగ్ విషయం తెలిసింది. పై అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. రాణాను మరో డివిజన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. అదేంటి? అరగంటలోనే బదిలీ ఏంటి? అని అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. అసలేం జరిగిందని ఆరా తీస్తే.. ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.
ఆదిరాజ్ రాణా.. రంపచోడవరం నుంచి ఆదోనికి బదిలీపై వచ్చారు. రంపచోడవరంలో ఆయన సింగం హీరో టైప్ పోలీసిజం ప్రదర్శించారట. సిన్సియర్‌గా డ్యూటీ చేసి.. క్రిమినల్స్‌కి, రాజకీయ నేతలకు చుక్కలు చూపించారని చెబుతున్నారు. అలాంటి నాలుగో సింహం ఆదోనికి రావడంతో స్థానిక నేతలు ఉలిక్కిపడ్డారని తెలుస్తోంది. ఆయనొస్తే తమ మాట చెల్లుబాటుకాదని, తమ దందాలు నడవవని.. బెదిరిపోయారట.
కింది స్థాయి పోలీస్ సిబ్బంది, చోటామోటా నాయకులు, పలువురు వ్యాపారులు.. అంతా కలిసి అధికార పార్టీ ప్రజాప్రతినిధి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారని అంటున్నారు. వారి విన్నపాన్ని మన్నించి.. ఆ పెద్దాయన.. ఏఎస్పీగా రాణా తమకు వద్దంటే వద్దంటూ విజయవాడ వెళ్లి మరీ డిపార్ట్‌మెంట్ పెద్దలతో మాట్లాడారట. ఇక చేసేది లేక.. ఆ లీడర్ చెప్పినట్టే.. ఆదిరాజ్ రాణాను ఆదోని నుంచి బదిలీ చేశారు ఉన్నతాధికారులు. బాధ్యతలు స్వీకరించిన అరగంటలోనే ట్రాన్స్‌ఫర్ కావడం.. జిల్లాలో చర్చనీయాంశమైంది.