Land Grabbing Case : ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. వైసీపీ అధికారంలో ఉండగా.. జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత వ్యక్తులు.. తనతో బలవంతంగా కోట్ల విలువైన భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ.. ఇబ్రహీంపట్నం మాజీ రిజిస్ట్రార్ ధర్మా సింగ్ ఆడియో ఫైల్స్ విడుదల చేశారు. అందులో.. జగన్ బినామీలుగా కొందరు వ్యక్తులు వ్యవహరించారని, వారి పేర్లుపై భూముల రిజిస్ట్రేషన్లు జరపాలని పెద్ద స్థాయి వ్యక్తుల నుంచి ఒత్తిడి వచ్చిందంటూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఈ విషయమై కీలక ఆడియో బిగ్ టీవీ చేతికి చిక్కింది. ఇందులో.. ఏకంగా రూ.700 కోట్ల విలువైన భూకబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు ఉండగా.. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన యాంకర్ రీతూ చౌదరి భర్త చీమకుర్తి శ్రీకాంత్, ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్ ధర్మా సింగ్ మాట్లాడుతున్నట్లు ఉంది.
ఈ ఆడియోలో చీమకుర్తి శ్రీకాంత్ మాట్లాడుతుండగా.. మాజీ రిజిస్ట్రార్ ధర్మా సింగ్ సమాధాలిస్తున్నట్లు ఉంది. కాగా.. ఈ సంభాషణలో గత ప్రభుత్వంలోని అనేక మంది కీలక వ్యక్తుల పేర్లు ప్రస్తావన వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి(IAS), కాకినాడ గ్రామీణం మాజీ ఎమ్మెల్యే, వ్యవసాయం, సహకార శాఖ మాజీ మంత్రి కురసార కన్నబాబు, రజిత్ అనే మరో వ్యక్తి పేర్లు ప్రస్తావించిన శ్రీకాంత్.. వీరంతా ఆ భూముల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు. ఈ మొత్తం ఆడియోలో.. కేఎన్ఆర్ అనే మరో ముఖ్యమైన వ్యక్తి చుట్టూ.. కీలక విషయాల్ని చర్చించారు. కాగా.. ఇప్పుడు ఆ కేఎన్ఆర్ అంటే ఎవరనే చర్చ మొదలైంది.
ఎవరీ కేఎన్ఆర్..
మాజీ సీఎం జగన్ దగ్గరకు ఎవరైనా వెళ్లాలి అంటే ముందు కేఎన్ఆర్ దగ్గరకు వెళ్లాలి. ఆయనకు చెబితే.. నేరుగా జగన్ కు చెప్పినట్లే. అంత పలుకుబడి ఉన్న వ్యక్తి కేఎన్ఆర్. ఓ సాధారణ పత్రికా రిపోర్టర్ గా పనిచేసిన వ్యక్తి.. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన జగన్ కు సన్నిహితుడిగా మారిపోయారు. ఇప్పటికీ.. పార్టీ నేతలైన, మరెవరైనా.. జగన్ కు ఏ విషయమైనా చేరవేయాలంటే.. ఈ కేఎన్ఆర్ కు ముందుగా చెప్పాల్సిందే. మరి.. ఈయన పూర్తి పేరు ఏంటో తెలుసా… కే. నాగేశ్వర రావు. జగన్ కు అత్యంత సన్నిహతమైన వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండే వారిలో…ఈ కేఎన్ఆర్ ఒకరని టాక్.
కడప ఎంపీగా జగన్ గెలిచిన తర్వాత దగ్గరైన కేఎన్ఆర్.. ఆ తర్వాత మరింత చేరువైనట్లు చెబుతుంటారు. అప్పటి నుంచి జగన్ మనసెరిగి నడుచుకుంటారని అంటుంటారు. జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రజా సంకల్ప పాదయాత్రలో అడుగడుగునా జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఉన్న కే.నాగేశ్వర రెడ్డి.. ఆ తర్వాత ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరించారు. జగన్ ఏ సమయానికి ఏం చేస్తారు. ఆయనకు ఏం కావాలో ఇట్టే కనిపెడతారని చెబుతుంటారు. అంతే కాదు.. జగన్మోహన్ రెడ్డి వెళ్లలేని ఏవైనా కార్యక్రమాలు, శుభకార్యాలకు ఆయన తరఫున వెళ్లి వచ్చేంత సానిహిత్యం ఉందని చెబుతుంటారు.
ఈ కారణంగానే.. ప్రస్తుత వైరల్ ఆడియోలో ఆయన పేరు రావడంతో.. ఈ రూ.700 కోట్ల భూమాయాజాలంలో నేరుగా ప్రభుత్వం పెద్దలే భాగస్వామ్యం అయ్యారా అనే అనుమానాలకు కారణం అవుతుంది.
ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్ ప్రస్తుతం ఏసీబీ అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా.. ఈ ఆడియో కూడా ఆయనే బయటపెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. ఇందులోని అంశాలు ఎంత వరకు నిజం, ఇందులోని వ్యక్తుల పాత్ర ఏ మేరకు ఉంది అనే విషయాలు మాత్రం పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ కేసుపై ప్రభుత్వం ఏ తీరుగా స్పందిస్తుందో, ఏ చర్యలకు ఆదేశిస్తుందో ఎదురు చూడాల్సి ఉంది.
Also Read : రాష్ట్రంలో భూ మాయలు.. ఈ ఆడియోలో అన్ని బాగోతాలు..
Note : ఈ ఆడియోలో పేర్కొన్న అంశాలను బిగ్ టీవీ, బిగ్ టీవీ వెబ్ సైట్ ధృవీకరించడం లేదు. లీకైన వీడియో, అందులోని అంశాలపై మాత్రమే విశ్లేషించాం. వాస్తవాలను ధృవీకరించాల్సి ఉంది.