ఏపీలో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తో ఈ వ్యవహారం తారాస్థాయికి చేరింది. మిథున్ రెడ్డితోపాటు జగన్ పేరు కూడా చార్జి షీట్ లో ఉండటంతో ఆయన అరెస్ట్ పై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ కేసులో జగన్ ని కూడా అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆ అరెస్టేదో జరిగితే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడటం ఇక్కడ విశేషం. జగన్ ని కూడా అరెస్ట్ చేస్తే సింపతీ వర్కవుట్ అవుతుందని, వచ్చే ఎన్నికలనాటికి అది తమకు ఉపయోగపడుతుందనేది వారి అంచనా. తాజాగా అంబటి రాంబాబు కూడా జగన్ అరెస్ట్ పై ఆసక్తికరంగా స్పందించారు.
LIVE: Guntur District President & Former Minister Sri Ambati Rambabu Press Meet https://t.co/NNjyHRUpo1
— YSR Congress Party (@YSRCParty) July 20, 2025
చేయొచ్చేమో..?
వైసీపీ లెక్కల ప్రకారం అసలు మిథున్ రెడ్డికే సంబధం లేదు అంటున్నప్పుడు జగన్ కి సంబంధం ఉంటుందా..? అయితే జగన్ అరెస్ట్ వ్యవహారంపై మాత్రం వారు విచిత్రంగా స్పందిస్తున్నారు. అరెస్ట్ లకు తాము భయపడేది లేదంటున్నారు అంబటి. మంత్రి లోకేష్ లిక్కర్ కేసులో ఎవరి పేరు రాస్తే వారు జైలులో ఉంటారని, మీ పేరు రాస్తే మీరు నా పేరు రాస్తే నేను, జగన్ పేరు రాస్తే ఆయన అరెస్ట్ అవుతారని చెప్పారు. గతంలో జగన్ కూడా తన అరెస్ట్ పై ధైర్యంగా స్పందించారన్నారు. ప్రెస్ మీట్ లో రిపోర్టర్ ప్రశ్న అడిగితే, తాను ఇక్కడే ఉన్నా కదా అరెస్ట్ చేసుకోండి అంటూ జగన్ బదులిచ్చారని గుర్తు చేశారు అంబటి. అరెస్ట్ లకు తమ పార్టీలో భయపడేవారెవరూ లేదన్నారాయన. వుయ్ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్.. అంటూ ప్రెస్ మీట్ లో గంభీరంగా మాట్లాడారు అంబటి.
కూటమి అధికారంలోకి వచ్చాక వివిధ కేసుల్లో వైసీపీ నేతలు కొంతమంది అరెస్ట్ అయ్యారు. వల్లభనేని వంశీ, నందిగం సురేష్, గోరంట్ల మాధవ్, కాకాణి గోవర్దన్ రెడ్డి సహా ఇంకొందరు నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఆయా అరెస్ట్ ల సమయంలో ఎప్పుడూ ఇంత హంగామా జరగలేదు. మిథున్ రెడ్డి అరెస్ట్ కాగానే మొత్తం లీడర్ టు క్యాడర్ అంతా అలర్ట్ అయింది. జగన్ సహా అందరూ ట్వీట్లు వేసి తమ నిరసన తెలిపారు. అంటే ఈ కేసు వ్యవహారం వైసీపీలో తీవ్ర గందరగోళానికి దారి తీసిందనే చెప్పాలి. ఇదే కేసులో జగన్ పేరు కూడా ఉండటంతో వైసీపీ హడలిపోతోందని అంటున్నారు నెటిజన్లు. మరోవైపు వైసీపీలో రెండు భిన్న వాదనలు వినపడుతున్నాయి. జగన్ అరెస్ట్ అయితే పార్టీపై సింపతీ వర్కవుట్ అవుతుందని అనుకునేవారు కొందరున్నారు. అధినేత అరెస్ట్ అయితే రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఇబ్బంది పడుతుందనే అనుమానం మరికొందరిలో ఉంది. ఎవరి అంచనా ఎలా ఉన్నా.. ఈ కేసులో జగన్ అరెస్ట్ పై ఇప్పుడప్పుడే క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. బెయిల్ పై బయటకొచ్చి తిరిగి రాజకీయం చేసుకునేలా ఉంటే జగన్ ని అరెస్ట్ చేయడం టీడీపీకి రాజకీయంగా నష్టం చేకూరుస్తుందనే చెప్పాలి. లిక్కర్ స్కామ్ లో నిందితులకు జైలు శిక్ష పడేలా పక్కా ఆధారాలు సేకరించగలిగితే మాత్రం అది వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.