ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోషల్ మీడియాలో బాగా ఫేమస్. జనంతో ఆయన మమేకమయ్యే వీడియోలు ఎన్నికల ముందు, తర్వాత కూడా బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆయన వీడియో మరోసారి వైరల్ గా మారింది. తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆయన కార్పెట్లు మడతపెడుతున్న వీడియో అది. అసలింతకీ మంత్రి నిమ్మల రోడ్డుపై కార్పెట్లు ఎందుకు మడతేశారు. ఆ కార్పెట్ వేసిన అధికారులకు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు..? అసలేంటి కథ..?
సోకులొద్దు..
డ్రైనేజీ నిర్మాణాలకు కూడా టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసినట్టు హడావిడి చేసే రోజులివి. పబ్లిక్ టాయిలెట్స్ ఓపెనింగ్ కి కూడా లక్ష ల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి రిబ్బన్లు కట్ చేసే కాలమిది. వార్డు కార్పొరేటర్ వస్తున్నారంటేనే రెడ్ కార్పెట్ పరచి అధికారులు స్వాగతం చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఒక మంత్రి వస్తున్నారంటే ఇంకెంత హడావిడి ఉంటుందో ఊహించుకోవచ్చు. మంత్రి నిమ్మల రామానాయుడు విషయంలో కూడా అధికారులు ఇలాగే ప్రవర్తించారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి నిమ్మల రాగా ఆయన కోసం కార్పెట్ పరిచారు. కారు దిగిన దగ్గర్నుంచి శిలా ఫలకం వరకు కార్పెట్ వేశారు. అయితే మంత్రి మాత్రం ఈ కార్పెట్ సంస్కృతి తనకు నచ్చదని చెప్పారు. అంతే కాదు, మరోసారి ఇలా ఎవరూ చేయకుండా తానే స్వయంగా ఆ కార్పెట్ ని మడతవేసుకుంటూ వచ్చారు. స్వయంగా మంత్రే తనకు వేసిన కార్పెట్ ని రోడ్డుపై మడత వేసుకుంటూ వెళ్తుండే సరికి అక్కడికి వచ్చినవారంతా షాకయ్యారు.
సూపర్ నిమ్మల రామానాయుడు గారు!! చక్కగా చెప్పారు!!
పరదాలు కార్పెట్లు జగన్ గారికి అని. @RamanaiduTDP 🙏🏻🙏🏻👏👏👏 pic.twitter.com/6dM44wvUU1
— CBN Army 🚲 (@LokeshNaraCM29) April 21, 2025
పరదాలు, కార్పెట్లు జగన్ కి..
కార్పెట్ మడత వేస్తూ పనిలో పనిగా మాజీ సీఎం జగన్ కి కూడా కౌంటర్లిచ్చారు మంత్రి నిమ్మల. పరదాలు, కార్పెట్లు జగన్ కి అలవాటన్నారు. పరామర్శలకు వచ్చినా కూడా ఆయన పరదాలు కట్టించుకునేవారని, టెంట్లు వేసుకునేవారని సెటైర్లు పేల్చారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ పరదాల విషయంలో జగన్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేసేవారు. గతంలో జగన్ ను పరదాల సీఎం అనేవారు లోకేష్. తాము అధికారంలోకి వచ్చాక, పరదాల సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టామని ఇప్పటికే పలుమార్లు చెప్పారాయన. అదే బాటలో మంత్రి నిమ్మల కూడా కార్పెట్లు తీసేయాలని అధికారులకు సూచించారు. కార్పెట్లు వేస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.
వైరల్ వీడియోలు..
టీడీపీలో మంత్రి నిమ్మలని వైసీపీ కూడా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తుంది. మీకు 15వేలు, మీకు 15వేలు అంటూ ఎన్నికల్లో ఆయన చేసిన ప్రచారాన్ని ఇప్పుడు వైసీపీ నేతలు వెటకారం చేస్తూ వీడియోలు పెడుతున్నారు. సాక్షాత్తూ జగన్ కూడా మంత్రి నిమ్మల వ్యాఖ్యల్ని ఇమిటేట్ చేశారు. అందుకేనేమో ఇప్పుడు నిమ్మల, జగన్ పై రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. పరదాలు, కార్పెట్లు జగన్ కి అలవాటని.. కూటమి ప్రభుత్వంలో అలాంటి ఆనవాయితీలు వద్దని చెప్పారు.