ఏపీలో సినిమా థియేటర్లలో తనిఖీలు జరుగుతున్నాయి. రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఈ తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు మంచివే కానీ, దీని వెనక రాజకీయ కోణం ఉందనే రచ్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం, థియేటర్ల వద్ద అధికారులు తనిఖీలకు రావడంతో అప్పట్లో పెద్ద గొడవ జరిగింది. అప్పుడు తమని విమర్శించిన జనసేన, టీడీపీ నేతలు, ఇప్పుడు అదే పని ఎలా చేస్తున్నారంటూ వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.
కూటమి ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ శాఖ జనసేనకు కేటాయించారు. కందుల దుర్గేష్ ఆ శాఖకు మంత్రి. కూటమి ప్రభుత్వం హయాంలో టికెట్ రేట్లు, అదనపు షో ల అనుమతుల వ్యవహారాలన్నీ ఆయన వద్దకే వస్తున్నాయి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెప్పి ఆయా వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు మంత్రి దుర్గేష్. అయితే ఇప్పుడు ఆ శాఖ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేస్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అయితే అదే సమయంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ కావాల్సి ఉంది. ఆ సినిమా విడుదల టైమ్ కి థియేటర్లు క్లోజ్ చేయడమేంటని మంత్రి దుర్గేష్ సీరియస్ అయ్యారు. దీనివెనక ఎవరున్నారా అనే ఆరా మొదలైంది. ఒక్కొక్క నిర్మాత బయటకు వచ్చి తమకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు. చివరకు ఈ గొడవలో జనసేన నేత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అయిన అత్తి సత్యనారాయణను పార్టీకి దూరం పెట్టారు.
ఈగొడవల మధ్యలో చివరకు సినిమాథియేటర్లకు షాక్ తగిలినట్టయింది. మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ ల ధరల్లో గుత్తాధిపత్యం నడుస్తోందని, థియేటర్లలో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోతే చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో తనిఖీలు మొదలయ్యాయి. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్ల ధరలు థియేటర్లలో అధికంగా ఉన్నాయని, ఆ ధరలను నియంత్రించాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ తనిఖీలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
గతంలో వైసీపీ హయాంలో సినిమా టికెట్ రేట్లు, థియేటర్ల వ్యవహారాలను చక్కదిద్దేందుకు అప్పటి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని, అయితే ఆ నిర్ణయాన్ని టీడీపీ, జనసేన నేతలు రాజకీయం చేశారని అంటున్నారు. అప్పట్లో సినీ పరిశ్రమను జగన్ తన చెప్పుచేతల్లో పెట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ, జనసేన తీవ్రంగా విమర్శించాయి. మరిప్పుడు ఈ తనిఖీలు ఎందుకని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. తనిఖీల పేరుతో వైసీపీ నేతలకు చెందిన థియేటర్లని టార్గెట్ చేస్తున్నారని కూడా వారు అంటున్నారు. టీడీపీ, జనసేన నేతలకు చెందిన థియేటర్లలో తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారని, కావాలనే ఇక్కడ కూడా వైసీపీ నేతల్ని ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు.
సినీ ఇండస్ట్రీలో సమస్యలున్నాయన్నమాట వాస్తవమే. థియేటర్ల ఓనర్లు తమకు లాభాలు రావడం లేదని గొడవ చేస్తున్నారు. రెంటల్ సిస్టమ్ ఉండాలా, పర్సంటేజీ విధానం కొనసాగించాలా అనే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరమా అనేదే మెయిన్ పాయింట్. ఒకవేళ ప్రభుత్వం జోక్యం చేసుకుంటే దాని వల్ల ఎవరు లాభపడాలి..? ప్రేక్షకులకు లాభం చేకూరేలా నిర్ణయం తీసుకుంటారా..? నిర్మాతల స్టాండ్ తీసుకుంటారా అనేవి ఇక్కడ కీలక అంశాలు. ఈ తేనెతుట్టెను ప్రభుత్వం కదల్చకుండా ఉంటే అంతా ప్రశాంతంగా ఉండేది. కానీ ఇక్కడ రచ్చ మొదలైంది. దీనివల్ల ఎవరో ఒకరు నిందలు మోయాల్సిన పరిస్థితి. ఈ సమయంలో మొత్తం థియేటర్ల వ్యవస్థను ప్రక్షాళణ చేస్తే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.