AP Students: మీ పిల్లలు కార్పొరేట్ స్థాయి విద్యను అందుకోవాలని మీకు ఆశ ఉందా? వేలల్లో ఫీజులు చెల్లించాలని భయపడుతున్నారా? అయితే కేంద్రం మీలాంటి వారి కోసం ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. ఆ చట్టం ఏమిటి? మీ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎలా అందుతుందో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో త్వరలోనే పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అయితే పేద తల్లిదండ్రులకు తమ పిల్లలకు మంచి విద్య లభించాలన్న కోరిక మరింతగా ఉంటుంది. అయితే కార్పొరేట్ పాఠశాలల్లో చదవాలంటే భారీగా ఫీజులు ఇవ్వాల్సి వస్తుందనే భయం చాలామందిలో ఉంది. కానీ, చాలా మందికి తెలియని అసలు విషయం ఏంటంటే.. ప్రైవేట్ స్కూల్‌లలో 25% ఉచిత సీట్లు ప్రభుత్వ చట్టం ప్రకారం అందుబాటులో ఉంటాయి. అందుకు కేంద్రం Right To Education Act – 2009 చట్టంను ప్రవేశపెట్టింది.
చట్టం ఉపయోగాలు..
ఈ చట్టం ప్రకారం, ప్రతి కార్పొరేట్ పాఠశాల తమ మొదటి తరగతి అంటే ఫస్ట్ క్లాస్ లో 25% సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలి. ఈ అవకాశాన్ని చాలా వరకు తల్లిదండ్రులు వినియోగించుకోని పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. అందుకే అసలు ఈ ప్రాసెస్ ఎలాగో తెలుసుకుందాం.
అర్హులు ఎవరు?
ఈ చట్టం ద్వారా ఫ్రీ సీటు పొందేందుకు కుటుంబ వార్షిక ఆదాయం రూ.1 లక్ష లోపుగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇస్తారు. అనాథ పిల్లలు, దివ్యాంగులు, కూలీల పిల్లలు, ప్రభుత్వ గుర్తింపు ఉన్న మౌలిక పాఠశాల పరిధిలో నివసించే వారు అర్హులు.
దరఖాస్తు విధానం..
కార్పొరేట్ పాఠశాలల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కొరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రతి రాష్ట్ర విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఫారమ్‌లు అందుబాటులో ఉంటాయి. జిల్లా విద్యాధికారిని సైతం మీరు సంప్రదించవచ్చు.
అవసరమైన డాక్యుమెంట్లు..
విద్యార్థి పుట్టిన సర్టిఫికేట్, ఆదాయ సర్టిఫికేట్, కుల, నివాస, దివ్యాంగ ధృవీకరణ పత్రాలు అవసరం. మీ నివాస ప్రాంతానికి సమీపంలోని పాఠశాలనే ఎంచుకోవాలి. ఎక్కువ దరఖాస్తులైతే లాటరీ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన తర్వాత, స్కూల్‌లో అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి.
పాఠశాలలు ఈ హక్కును నిరాకరిస్తే?
ఏవైనా పాఠశాలలు ఈ హక్కును నిరాకరిస్తే జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో కంప్లెయింట్ ఫైల్ చేయవచ్చు. RTI ద్వారా ఆ పాఠశాల సీట్ల వివరాలు అడగవచ్చు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది.
పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను పొందే హక్కుతోనే ఈ చట్టం రూపొందించబడింది. అయితే చాలా మంది తల్లిదండ్రులకు ఈ అవకాశంపై సరైన అవగాహన లేదనే చెప్పవచ్చు. మీరు మీ పిల్లల భవిష్యత్‌కు కార్పొరేట్ పాఠశాలలో ఉచిత చదువుతో బంగారు బాట వేయాలంటే, ఇప్పుడే అప్లై చేసుకోండి.. డోంట్ మిస్ దిస్ ఛాన్స్. చివరగా ఒక మాట ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వ బడులు సైతం కార్పొరేట్ పాఠశాల స్థాయి విద్యను అందిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ బడులలో మీ పిల్లలను చేర్పిస్తే, వారి భవిష్యత్ కు బంగారు బాటలు వేయవచ్చు.