AP Police Constables: మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పరేడ్ గ్రౌండ్స్‌లో 2025–26 బ్యాచ్‌కి చెందిన 149 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (APSP) పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై, కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.
ప్రజల్లో భరోసా నింపాలి
కార్యక్రమంలో హోంమంత్రి మాట్లాడుతూ.. ‘పోలీసులంటే ప్రజల్లో భయం కాకుండా భరోసా కలగాలి. యూనిఫాం వేసుకున్న ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వంతో విధులు నిర్వర్తించాలి. స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఓపికగా వినాలి’ అని సూచించారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని, అందుకోసమే సాంకేతిక నైపుణ్యాలున్న వారికి సైబర్ నేరాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు.
నియామకాల పూర్తి.. పెరిగిన స్టైపెండ్
6 వేల మంది కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచినట్లు వెల్లడించారు.
పోలీస్ వ్యవస్థకు వెన్నెముక
రాష్ట్రవ్యాప్తంగా 21 శిక్షణ కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకోగా, అందులో 2,330 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో సుమారు 1,000 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండటం గమనార్హం. పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అని, విపత్తులు, బందోబస్తు సమయాల్లో సమర్థంగా పనిచేసి, 2047 విజన్‌లో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
Also Read: KTR, హరీష్‌రావు పేర్లు ఫామ్‌హౌస్ రావు 1, 2గా మార్చుకోవాలి: బల్మూరు వెంకట్