YSRCP : కాకాణి గోవర్ధన్ రెడ్డి. 10 రోజులుగా మీడియాలో డైలీ కవరేజ్. కాకాణికి నోటీసులు. కాకాణి ఎక్కడ? హైకోర్టుకు కాకాణి. విచారణకు కాకాణి వస్తారా? ఇలా ఆయన పేరు మారుమోగిపోతోంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఈ సారి మాజీగా మారిన ఆయన కోసం 6 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. కనిపిస్తే.. పట్టేసుకుందామని వెతుకుతున్నాయి. కాకాణి దేశం విడిచి పారిపోయే ఛాన్సెస్ ఉన్నాయనే అనుమానంతో ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. అన్ని ఎయిర్‌పోర్టులు, సీపోర్టులను అలర్ట్ చేశారు.
కాకాణి కోసం సెర్చ్ ఆపరేషన్
మాజీ మంత్రి మాత్రం చిక్కడు, దొరకడు టైప్‌లో తప్పించుకు తిరుగుతున్నారు. ఏపీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. పరారీలో కాకాణి. ఎక్కడ ఉన్నారో తెలీదు. ఎక్కడికి పారిపోయారో అంతుచిక్కడం లేదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో ఉండొచ్చని ఆయా ప్రాంతాల్లో వెతుకుతున్నారు పోలీసులు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఇళ్లపై నిఘా పెట్టారు.
250 కోట్ల గోల్‌మాల్.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
కాకాణికి హైకోర్టులో రిలీఫ్ దక్కలేదు. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్, సరఫరా కేసులో హైకోర్టును ఆశ్రయించారు. కాకాణిపై క్వార్ట్జ్ కేసుతో పాటు SC, ST అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. 250 కోట్లకు పైగా విలువ చేసే క్వార్ట్జ్‌ను విదేశాలకు ఎగుమతి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మనీ లాండరింగ్ కూడా జరిగిందనే అనుమానం ఉంది. అందుకే, విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మూడుసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన రాలేదు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు సైతం నిరాకరించింది. కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే.. అక్రమ మైనింగ్‌లో కాకాణి ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా స్పష్టం అవుతోందని కోర్టు అభిప్రాయపడింది. సమగ్ర విచారన జరపాల్సిన అవసరం ఉందని తెలిపింది. పోలీసులు కాకాణిపై తగు చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
కాకాణి తప్పించుకోలేరా?
ఇంకేం. కోర్టే చెప్పాక ఇక పోలీసులు ఊరుకుంటారా? తప్పించుకు తిరుగుతున్న కాకాణిని వెంటాడి.. వేటాడాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఆయన ఏ రాష్ట్రంలో, ఏ కన్నంలో దాగున్నా పసిగట్టి పట్టుకుంటామని చెబుతున్నారు. కాకాణి కోసం స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇవాళో, రేపో, మాపో.. ఆయన చిక్కడం కన్ఫామ్ అంటున్నాయి.
Also Read : బట్టలూడదీసి ఏం చూస్తావ్? జగన్‌కు పోసాని పంచ్?
వైసీపీలో టెన్షన్.. సుప్రీంకోర్టుకు వెళతారా?
కాకాణి వ్యవహారంతో వైసీపీలో ఆందోళన పెరిగింది. బలమైన నేతలు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతుండటం ఆ పార్టీ కాన్ఫిడెన్స్‌ను దెబ్బ తీస్తోంది. నందిగాం సురేశ్ నుంచి వల్లభనేని వంశీ వరకు.. జైలు జీవితం గడపాల్సి వచ్చింది. కొడాలి, పెద్దిరెడ్డి, జోగి, పేర్ని, రోజా.. ఇలా ఆ లిస్ట్ ఇంకా పెద్దదిగానే ఉంది. వీళ్లందరికంటే ముందు కాకాణిని ఫిక్స్ చేసేలా పావులు కదుపుతోంది ప్రభుత్వం. ఆయనకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు, బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఒక్కసారి అరెస్ట్ చేస్తే.. ఇక కాకాణి తప్పించుకోవడం చాలా కష్టమే. ఆయనకు జైలు తప్పదనే ప్రచారం.. నెల్లూరు వైసీపీకి తీరని లోటే. అయితే, హైకోర్టులో ఊరట దక్కని కాకాణి గోవర్ధన్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది. కాకాణి ఎపిసోడ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి..