ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద ఒక్కొక్కరికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందజేయనుంది. అక్టోబర్ 1న లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. అయితే అర్హులైన ఆటో డ్రైవర్లు ఈ నెల 17 నుంచి 20 తేదీ లోపు గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. అయితే దరఖాస్తు గడువును పెంచాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు.
వాహన మిత్ర పథకం దరఖాస్తులో పలు సమస్యలు వస్తున్నాయి. దీంతో అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సమస్యలు ఉన్నవారు అర్జీ నమోదుకు సచివాలయ శాఖ ఆప్షన్ ఇచ్చింది. గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్, వార్డు సచివాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ బీఎం పోర్టల్ లాగిన్ లో ఆప్షన్ ఇచ్చారు. అర్జీ నమోదుకు వివిధ ఆప్షన్లు ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ, ఫిట్ నెస్, వెహికల్ ట్యాక్స్, ఆర్సీ సమస్యలు, తప్పు కేవైసీ, ఇతర ఆప్షన్లు ఎనెబుల్ చేశారు. ఏదైనా కారణంగా దరఖాస్తులో ఇబ్బందులు వస్తే అర్జీ చేసుకోవచ్చు.
వాహన మిత్ర పథకానికి కొత్తగా దరఖాస్తు చేసేందుకు నేడే(సెప్టెంబర్ 20) చివరి తేదీ కాగా, వెరిఫికేషన్ కు మాత్రం సెప్టెంబర్ 22 వరకు అవకాశం కల్పించారు.
Also Read: తిరుమల పరకామణిలో రూ.100 కోట్ల స్కామ్.. టీటీడీ బోర్డు సభ్యుడు సంచలన ఆరోపణలు
వాహనమిత్ర పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరాకు ఈ పథకాన్ని అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. నిన్న జరిగిన మంత్రివర్గ భేటీలో పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకుంది. అర్హుల జాబితాపై అధికారులకు సూచనలు చేసింది. అర్హులైన వారి ఖాతాల్లో రూ.15 వేలు జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబర్ 1న లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.