Tirumala: ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరచూ వార్తల్లో నిలుస్తుంది. కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ కొట్టిపారేస్తుంది. అయితే ఈసారి టీటీడీ బోర్డు సభ్యుడే సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయాన్ని భద్రపరిచి, లెక్కించే ‘పరకామణి’లో అవకతవకలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. పరకామణిలో రూ. 100 కోట్ల చోరీ జరిగిందని టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భాను ప్రకాష్ రెడ్డి.. పలు వీడియోలు ప్రదర్శించారు. రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తున్నట్లు ఈ వీడియో ఉందని భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. గత కొన్నేళ్లుగా రవికుమార్ ఈ తరహా చోరీలు చేస్తూ ఆ డబ్బులను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెడుతున్నారని ఆరోపించారు. ఒకరి నుంచి మరొకరు ఇలా దొంగలు అందరూ స్వామివారి సొమ్మును దోచుకున్నారన్నారు.
“గత ప్రభుత్వంలో రూ.100 కోట్లు అప్పటి అధికారుల చేతులు మారింది. ఎవరెవరు, ఎంతెంత, ఎక్కడ డబ్బులు స్వాహా చేశారో రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి. చెన్నైలోని టీటీడీ ఆస్తులను బదలాయించుకున్న అధికారులు ఎవరు? రాజీ చేసుకున్న అధికారులు ఎవరు? రాజీ చేసిన పెద్ద మనుషులు ఎవరు? నేను పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను”- టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి
టీటీడీ చరిత్రలో అత్యంత భారీ చోరీ గత ప్రభుత్వంలో జరిగిందని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. స్వామి వారి హుండీలో భక్తులు ఎంతో భక్తితో వేసిన కానుకలను కొందరు దోచుకున్నారన్నారు. రూ.100 కోట్ల పైగా పరకామణిలో చోరీ జరిగిందన్నారు. ఈ కేసును హైకోర్టు సీఐడీకి అప్పగించిందని, వచ్చే నెల రోజుల్లో విచారణ జరిపి సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి బోర్డు నిర్ణయాలను ఇతర డాక్యుమెంట్లను అన్నింటిని సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించిందని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: బోండా ఉమ ఓవర్ చేస్తుండు.. సంగతేంటో చూడండి.. బాబుకు పవన్ కంప్లైంట్
ఈ కేసులో చాలా మంది వైసీపీ నేతలు, ఉన్నతాధికారులు ఉన్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. త్వరలోనే అందరి పేర్లు బయటకు పడతాయన్నారు. త్వరలోనే ఓ అధికారి రూ. 100 కోట్ల స్కామ్ కు సంబంధించిన అన్ని వివరాలను బయటపెట్టబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి సొత్తును దోచుకునేందుకు ఓ పోలీస్ అధికారి కీలకంగా వ్యవహరించారన్నారు. ఈ స్కామ్ జరిగినప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఛైర్మన్ గా ఉన్నారని, దీనిపై ఆయన సమాధాన చెప్పాలని డిమాండ్ చేశారు. దోచుకున్న సొమ్మును తాడేపల్లి ప్యాలెస్ చేర్చారన్నారు.