Visakhapatnam vs Vijayawada: ఏపీకి ఊహించని క్రెడిట్ దక్కింది. దేశంలోనే ఈ ఘనత దక్కించుకున్న జాబితాలో ఏపీ చేరడంతో మరో మారు తెలుగు రాష్ట్రం అందర్నీ ఆకర్షిస్తోంది. ఇంతకు ఏపీకి దక్కిన ఆ క్రెడిట్ ఏమిటి? అందులోనూ ఆ నగరాల స్పెషాలిటీ ఏమిటో తెలుసుకుందాం.
ఎవరూ ఊహించని స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు దేశవ్యాప్తంగా ఉద్యోగ, టాలెంట్ వృద్ధి జాబితాలో స్థానం లభించింది. ఉద్యోగాల కోసం యువత ఏవేవో మెట్రో నగరాలపై ఆశలు పెట్టుకునే కాలం పోయింది. ఇప్పుడు LinkedIn విడుదల చేసిన Top 10 Emerging Cities for Jobs.. Talent in India లిస్ట్‌లో ఏకంగా రెండు తెలుగు నగరాలు టాప్ – 3లో చోటు దక్కించుకోవడం గర్వించదగిన విషయమే కాదు.. రాష్ట్ర అభివృద్ధి దిశగా కదులుతున్న ప్రజలకు కొత్త అవకాశాలకు దరిచేర్చే మార్గంగా చెప్పవచ్చు.
విశాఖపట్నం గ్రేట్..
విశాఖపట్నం పేరు మనకు సముద్రతీరపు అందాలు, ఓడరేవు, షిప్‌యార్డులు గుర్తుకు తెస్తాయేమో కానీ, ఇప్పుడు అది దేశానికి ఉద్యోగ కేంద్రంగా మారింది. LinkedIn లిస్ట్‌లో 1వ స్థానంలో నిలిచిన విశాఖ.. ఇప్పుడు ఐటీ, ఫినాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్, మెటల్-మినరల్స్, మరెన్నో రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది.
విశాఖను రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం, మౌలిక వసతుల్లో పెరుగుదల, తక్కువ జీవన ఖర్చులు.. ఇవన్నీ కలసి ఈ నగరాన్ని ఉద్యోగాల దారిలో అగ్ర స్థానానికి చేర్చాయి.
విశాఖలో పలు స్టార్టప్‌లకు కేంద్రంగా పనిచేస్తున్న టెక్ హబ్‌లు, హిల్ టాప్ ఐటీ టవర్స్, కొత్తగా ఏర్పాటు అవుతున్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు దీనికి నిదర్శనం. ఇక 3వ స్థానంలో నిలిచిన విజయవాడ కూడా ఊహించని రీతిలో జాబితాలోకి ఎక్కింది. ఇది కృష్ణా నదీ తీరాన ఉన్న ప్రసిద్ధ నగరం మాత్రమే కాదు.. ఇప్పుడు యువత ఉద్యోగావకాశాల కోసం చూస్తున్న కొత్త ఐటీ పట్టణంగా ఎదుగుతోంది. బెంజ్ సర్కిల్ నుంచి గన్నవరం విమానాశ్రయ ప్రాంతం వరకూ విస్తరించిన అభివృద్ధి.. ఈ నగరాన్ని తక్కువ సమయంలోనే ఉద్యోగల పరంగా విశాఖకు సమీపించే స్థాయికి తీసుకొచ్చాయి.
విజయవాడలో KL, SRM, NID వంటి టాప్ విద్యాసంస్థలు ఉండటం వల్ల అక్కడి విద్యార్హత గల యువత కంపెనీలకు సిద్ధంగా ఉంది. స్టార్ట్‌అప్ వాతావరణం కూడా మెరుగుపడుతోంది. ఇటీవల కాలంలో రిటైల్, రియల్ ఎస్టేట్, టెలికాం, కన్స్ట్రక్షన్ రంగాల్లో వచ్చిన అవకాశాలు నగరానికి ఊపిరి నింపాయి. ముఖ్యంగా గవర్నమెంట్ పాలసీలు, రవాణా వ్యవస్థకు అనుకూలంగా ఉండటం విజయవాడ అభివృద్ధికి కారణమయ్యాయి.
విశాఖ – విజయవాడలకు వెంటనే జాబ్స్ వచ్చే నగరాలు లిస్ట్‌లో ఉన్నా, వాటిపై పెద్దగా ప్రభావం కనిపించదు. రెండవ స్థానంలో ఉన్న రాంచీ వంటి నగరాలు పేద రాష్ట్రాల్లో శాంతంగా ఎదుగుతున్న కేంద్రాలే. అలాగే నాసిక్, రాయ్‌పూర్, రాజ్‌కోట్ వంటి నగరాలు చిన్న పరిశ్రమలు, విద్యా కేంద్రాల వల్ల అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నాయి.
ఉత్తరాదిన ఉన్న ఆగ్రా, జోధ్‌పూర్ వంటి నగరాలు మాత్రం ఇప్పటికీ టూరిజం ఆధారిత మార్కెట్లుగా కొనసాగుతుండగా, మదురై, వడోదరలాంటి నగరాలు భవిష్యత్‌లో ఏదో స్థాయికి చేరవచ్చని LinkedIn విశ్లేషిస్తుంది. అయితే వీటి అభివృద్ధి రేటు విశాఖ, విజయవాడల చుట్టూ కూడా తిరగలేని స్థాయిలో ఉంది.
Also Read: Ghost footprints video: ఇదేం దెయ్యమో? ఏకంగా అక్కడికి ఎలా వెళ్లింది! వీడియో వైరల్!
LinkedIn లాంటి ప్రొఫెషనల్ నెట్‌వర్క్ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లోని డేటాను ఆధారంగా తీసుకొని ఈ జాబితా తయారు చేస్తాయి. ఇందులో ఉద్యోగాల పెరుగుదల, టాలెంట్ మైగ్రేషన్, కొత్త కంపెనీలు ప్రారంభం, ఉద్యోగుల స్కిల్స్ వంటి అంశాలనూ బాగా పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఈ ర్యాంకింగ్ లెక్కల్లో లేని వాటికంటే.. భవిష్యత్తులో కంపెనీలు ఎటు మళ్లుతాయన్నదికూడా దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం యువత బెంగళూరు, హైదరాబాద్, పుణె, గురుగ్రాం లాంటి నగరాల వైపు ఆశగా చూసేవారు. కానీ ఈ జాబితా ఇప్పుడు కొత్త సంకేతాలను ఇస్తోంది. చిన్న నగరాలు సైతం ఉద్యోగ కేంద్రాలుగా మారుతున్నాయంటే, టాలెంట్ మైగ్రేషన్ కూడా కొత్త దిశలో సాగుతోంది. విశాఖపట్నం, విజయవాడలు దానికి ప్రత్యక్ష నిదర్శనం.
యువత ఇక తక్కువ ఖర్చుతో, ఎక్కువ అవకాశాలతో ఉన్న సొంత రాష్ట్రంలోనే పని చేసేందుకు మొగ్గు చూపే రోజులు దూరం లేవు. వాస్తవానికి ఇది కేవలం గణాంకాల లిస్టు కాదు, ఉద్యోగ భవిష్యత్తును చూపే దిక్సూచి. ఏపీ ఇప్పుడు టాలెంట్ మ్యాప్‌లో తలెత్తిందంటే.. రేపటి మన యువత విజయగాధలకు వేదిక కూడా అవుతుందన్నమాట!