AP Rains: ఏపీలో మళ్లీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు(ఆదివారం) పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర కర్ణాటక మీదుగా సగటున సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని పేర్కొంది.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
శనివారం రాత్రి ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ, మహానందిలో శనివారం భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలతో కోవెలకుంట్ల-జమ్మలమడుగు మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగు పొంగడంతో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వంతెన మధ్యలో చిక్కుకుపోయింది. అధికారులు అప్రమత్తమై జేసీబీ సాయంతో బస్సులోని ప్రయాణికులను కాపాడారు. మహానంది మండలంలో పాలేరు వాగు పొంగడంతో సమీప ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Also Read: వాహన మిత్ర పథకం దరఖాస్తులో సమస్యలా? అయితే ఇలా చేయండి?
విజయవాడ నగరంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలు పడ్డారు. భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.