YS Viveka Case: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి మాజీ ఎంపీ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు త్వరలోనే ఎండ్ కార్డు పడుతుందా? ఆ దిశగా పోలీసుల విచారణ సాగుతోందా? మొత్తం మీద ఆరేళ్లుగా ఎటూ తేలక కొనసాగుతూ.. ఉన్న వివేకా హత్య కేసు దర్యాప్తుకు ఇక శుభం కార్డు పడడం ఖాయమని ఇదే కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి చెప్పడం విశేషం.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే. అయితే తనను కడప సబ్ జైలులో ఉంచిన సమయంలో ముగ్గురు పోలీస్ అధికారులు, ఇదే కేసు నిందితుడు దేవి రెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి తనను అబద్దాలు చెప్పాలని ప్రలోభ పెట్టినట్లు దస్తగిరి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
శుక్రవారం కడప జైలులో దస్తగిరిని ఈ కేసుకు సంబంధించి మూడు గంటల పాటు పోలీస్ అధికారులు విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా కడప జైలులో గత ఏడాది తాను ఎదుర్కొన్న ఇబ్బందులను, బెదిరింపులను, విచారణ అధికారికి తెలిపినట్లు దస్తగిరి తెలిపారు. విచారణ అనంతరం మీడియాతో దస్తగిరి మాట్లాడుతూ.. సంచలన కామెంట్స్ చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో జరిగిందని, అప్పుడు తన అనుకూల మీడియాలో నారాసుర రక్త చరిత్ర అంటూ.. ప్రచురించిన జగన్ తన పాలనలో ఏమి చేశారంటూ ప్రశ్నించారు.
ఐదేళ్లు అధికారంలో ఉండి కూడ వివేకా కేసును జగన్ ఎందుకు తేల్చలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులో కదిలిక వచ్చిందని, త్వరలోనే అన్ని నిజాలు బయటికి వస్తాయంటూ దస్తగిరి చెప్పడం విశేషం. ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని, వివేక హత్య కేసు కు త్వరలోనే ఎండ్ కార్డు పడుతుందని దస్తగిరి చెప్పడం మరో విశేషం. ఆరేళ్లుగా దర్యాప్తులకే పరిమితమైన ఈ హత్య కేసును ఛేిదించాలని సీఎం చంద్రబాబుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దస్తగిరి విన్నవించారు.
Also Read: Tirupati Crime: శ్రీవారిని దర్శించుకొని మరీ.. తిరుమలలో దంపతుల ఆత్మహత్య
దస్తగిరి చేసిన కామెంట్స్ ను బట్టి వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని చెప్పవచ్చు. మరి ఆ ఎండ్ కార్డు పడే సమయం ఎప్పుడంటూ ప్రస్తుతం ఏపీలో చర్చ సాగుతోంది. కాగా దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదులో కేసు నమోదైన డాక్టర్ చైతన్య రెడ్డి, జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ లు రేపు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.