BigTV English
Advertisement

Viveka Murder: 40 కోట్లకు డీల్? వివేకా హత్య కుట్ర అవినాశ్‌రెడ్డిదేనా? సీబీఐ రిపోర్ట్‌లో ఏముంది?

Viveka Murder: 40 కోట్లకు డీల్? వివేకా హత్య కుట్ర అవినాశ్‌రెడ్డిదేనా? సీబీఐ రిపోర్ట్‌లో ఏముంది?

Viveka Murder: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుగా విచారణ చేస్తోంది. అనేక మందిని ప్రశ్నించి, పక్కా ఆధారాలు సేకరించింది. వివేకాను ఎవరు ఎలా చంపారో ఓ అంచనాకు వచ్చింది. వివేకా హత్యకు కుట్ర ఎవరు చేశారో కూడా తేల్చేసింది. ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలు వివేక హత్య కేసులో కుట్రదారులుగా భావిస్తోంది. తాజాగా కోర్టుకు సమర్పించిన కౌంటర్ రిపోర్టులో ఆ వివరాలు వెల్లడించింది. ఇంతకీ సీబీఐ రిపోర్టులో ఏముందంటే….


“2013లో వివేకా కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. 2014లో టికెట్‌ ఇవ్వలేదు. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోయారు. ఎమ్మెల్సీగా పోటీ చేయాలని ఆశించిన శివశంకర్‌రెడ్డికి టికెట్‌ ఇప్పించేందుకు భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ప్రయత్నించారు. టికెట్‌ దక్కకపోవడంతో వీరు ముగ్గురు వివేకాపై కక్ష పెంచుకున్నారు. వీరికి గంగిరెడ్డి సహకారం అందించాడు”.

“2019కల్లా రాజకీయంగా వివేకా మరింత యాక్టివ్ అయ్యారు. కడప ఎంపీ సీటును షర్మిల, విజయమ్మల్లో ఒకరికి ఇవ్వాలని వివేకా పట్టుబట్టారు. అవినాష్‌రెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇప్పించాలని ప్రయత్నించారు. షర్మిలను కడప ఎంపీ బరిలో నిలపడానికి ఒప్పించారు. ఈ విషయం తెలిసి అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలు కుట్ర పన్నారు”.


“2019 మార్చి 15న భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల ఇంట్లో శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అప్పటికే హత్య సమాచారం తెలిసినా.. సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి వారు అక్కడే వేచి ఉన్నారు. సమాచారం బయటికి రాగానే వేకువజామున 5.20 గంటలకు వెళ్లి సాక్ష్యాలను ధ్వంసం చేశారు. ఘటనా స్థలాన్ని శుభ్రం చేశారు. వివేకా గాయాలకు కట్టుకట్టి ఆస్పత్రికి తరలించారు”.

“వివేకా హత్య జరిగిన రోజు ఉదయం స్థానిక నేత కె.శశికళ రాగా వివేకాకు గుండెపోటు వచ్చిందని అవినాష్‌రెడ్డి ఆమెకు చెప్పారు. అవినాష్‌రెడ్డి తన ఫోన్‌ నుంచి మరో నెంబరుకు కాల్‌ చేశాడు. తరువాత మరో రెండు కాల్స్‌ చేశాడు. తర్వాత పీఏ రాఘవరెడ్డి ఫోన్‌తో సీఐ జె.శంకరయ్యకు కాల్‌ చేసి.. వివేకా గుండెపోటుతో రక్తవాంతులు చేసుకుని చనిపోయారని, భద్రత కోసం పోలీసులను పంపాలని అడిగారు. పోలీసులను పంపిన సీఐ సంఘటనా స్థలానికి చేరుకోలేదు. హత్య విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే రహస్యంగా ఉంచారు. సహజమరణంగా కట్టు కథ అల్లి చెప్పారు”.

“వివేక హత్య పథకం అమలులో సునీల్‌యాదవ్‌‌ది కీరోల్. హత్యకు ముందు ఏడాదిన్నరగా వివేకాతో కలిసి ఉంటున్నాడు. మొదట్లో సునీల్‌యాదవ్‌ను బాగా చేరదీసిన వివేకా.. అతని చర్యలు నచ్చక దూరం పెట్టారు. దీంతో సునీల్‌.. వివేకాపై కక్ష పెంచుకున్నాడు. ఇదే సమయంలో వివేకా హత్యకు కుట్రలో భాగంగా రూ.40 కోట్లలో రూ.5 కోట్లు వాటా ఇస్తామని గంగిరెడ్డి ఆఫర్ ఇచ్చాడు. వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డిల తరఫున గంగిరెడ్డి డబ్బు తీసుకున్నాడు”.

“దస్తగిరికి రూ.కోటి ఇచ్చి.. అందులో రూ.25 లక్షలు ఉంచుకుని తిరిగి ఇస్తానని సునీల్‌యాదవ్‌ చెప్పాడు. పథకానికి పది రోజుల ముందు సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలు వివేకా కుక్కను కారుతో ఢీకొట్టి చంపేశారు. 2019 మార్చి 12న వివేకా భార్య సౌభాగ్యమ్మ ఓ కార్యక్రమం కోసం హైదరాబాద్‌ వెళ్లారు. ఇదే మంచి సమయమని వారు భావించారు. సునీల్‌యాదవ్‌ గొడ్డలి కావాలని అడగడంతో.. దస్తగిరి పులివెందులకు 35 కిలోమీటర్ల దూరంలోని కదిరికి వెళ్లి గొడ్డలి తీసుకొచ్చాడు”.

“2019 మార్చి 14న వైఎస్ అవినాశ్‌రెడ్డి ఇంట్లో సునీల్‌ యాదవ్‌ ఎదురుచూస్తున్నాడు. రాత్రి 8.30 గంటలకు దస్తగిరి గొడ్డలి తీసుకుని వచ్చాడు. సునీల్, దస్తగిరి మద్యం సేవించారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలు వెనుకవైపు కాంపౌండ్‌ దాటి వివేకా ఇంట్లోకి వెళ్లారు. వారికి గంగిరెడ్డి సహకరించాడు. వారిని చూసిన వివేకా.. ఈ సమయంలో ఎందుకొచ్చారని ప్రశ్నించారు. డబ్బు లావాదేవీలు మాట్లాడటానికి వచ్చారని గంగిరెడ్డి వివేకాకు సర్దిచెప్పాడు. కాసేపటికి సునీల్‌ యాదవ్‌ తిడుతూ.. వివేకా ఛాతీపై కొట్టడం ప్రారంభించాడు. దస్తగిరి నుంచి ఉమాశంకర్‌రెడ్డి గొడ్డలి తీసుకుని వివేకా నుదుటిపై దాడి చేయడంతో తీవ్రగాయమైంది”.

“డ్రైవర్‌ ప్రసాద్‌ తనను కొట్టినట్లు వివేకాతో బలవంతంగా లేఖ రాయించారు. తర్వాత గాయాలతో ఉన్న వివేకాను బాత్‌రూంలోకి తీసుకెళ్లి తలవెనుక ఏడెనిమిదిసార్లు ఉమాశంకర్‌రెడ్డి గొడ్డలితో దాడి చేశాడు. సునీల్‌ యాదవ్‌ వివేకా మర్మాంగాలపై బలంగా తన్నాడు. వివేకా చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. వాచ్‌మన్‌ రంగన్న నిందితులను గుర్తించాడు”.

–ఇవన్నీ నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ కోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లో ఉన్న వివరాలు.

Related News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

Big Stories

×