Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ (AP HRC) నియామకాల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నియామక ప్రక్రియ సాగుతున్న తీరుపై శాసనమండలి ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయనొక లేఖ రాశారు.
24 గంటల ముందే సమాచారమా?
కమిషన్ సభ్యుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి సంబంధించి తనకు కేవలం 24 గంటల ముందే సమాచారం అందించారని బొత్స తన లేఖలో పేర్కొన్నారు. ప్రతిపాదనలను, దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించడానికి కనీస సమయం కూడా ఇవ్వకపోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
పూర్తి పరిశీలన..
మానవ హక్కుల కమిషన్ వంటి కీలకమైన రాజ్యాంగబద్ధమైన సంస్థలో నియామకాలు అత్యంత పారదర్శకంగా జరగాలని బొత్స డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసిన వారి అర్హతలు, వారి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏమాత్రం తొందరపాటు లేకుండా, నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి అధ్యయనంతోనే ఈ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
సమావేశానికి దూరంగా బొత్స
పరి పరిశీలనకు తగినంత సమయం లేనందున, అక్టోబర్ 12న నిర్వహించతలపెట్టిన ఎంపిక కమిటీ సమావేశానికి తాను హాజరుకాలేకపోతున్నానని లేఖలో స్పష్టం చేశారు. ఈ రకమైన అరకొర సమాచారంతో, హడావుడిగా నిర్వహించే నియామక ప్రక్రియలో పాలుపంచుకోవడం తనకు సమ్మతం కాదని, తన నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి, మానవ హక్కుల కమిషన్ సభ్యుల ఎంపిక ప్రక్రియపై బొత్స లేఖతో వివాదం రాజుకుంది. ప్రభుత్వం ఈ అభ్యంతరాలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి!
Also Read: ముగ్గురి ప్రాణాలు తీసిన మినీ కూపర్.. ‘మా నాన్న చూసుకుంటాడు’ అంటూ డ్రైవర్!