Bhishm Health Cube: ఒక హాస్పిటల్‌ను ట్రక్‌లో కాకుండా.. డ్రోన్‌లో పంపితే ఎలా ఉంటుందో ఊహించగలరా? పోతున్న ప్రాణాలను ఆదుకునేందుకు, యుద్ధభూముల్లోనైనా, వరదల మధ్యనైనా, ఎడారుల్లోనైనా ఒక్కసారి ల్యాండ్ అవుతే చాలు .. ఇట్టే చికిత్స మొదలవుతుంది! ఇలాంటి అద్భుతం ఇప్పుడు నిజం చేసింది భారత్. అదే భీష్మ్ హెల్త్ క్యూబ్ (BHISHM Health Cube). ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి పూర్తిగా పోర్టబుల్ ఆసుపత్రి.. 10 నిమిషాల్లో సిద్ధమవుతుంది. ఈ నూతన ఆవిష్కరణకు మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యశాల వేదిక అయింది.
భీష్మ్ హెల్త్ క్యూబ్ ఎలా ఉంటుందంటే?
ఒక చిన్న క్యూబ్ ఆకారంలో కనిపించే ఈ పోర్టబుల్ హాస్పిటల్, నిజంగా ఆశ్చర్యకరం. ఒక్కసారిగా విపత్తు సంభవించినప్పుడు.. అక్కడికక్కడే సెటప్ అవుతుంది. 200 మందికి ప్రాథమిక వైద్యం ఇవ్వగలదు. అంతేకాదు, ఒకేసారి 20 అత్యవసర శస్త్రచికిత్సలు నిర్వహించగల సామర్థ్యం కూడా ఉంది. అంటే ఇది ఒక చిన్న ప్రాణరక్షణ కేంద్రంగా మారిపోతుంది.
సౌరశక్తితో పనిచేసే సాంకేతిక అద్భుతం
ఈ ఆసుపత్రి సిస్టమ్ మొత్తం సౌరశక్తిపై ఆధారపడి పనిచేస్తుంది. దీని వల్ల ఎలాంటి విద్యుత్ సరఫరా లేకున్నా.. ఎక్కడైనా పనిచేస్తుంది. కాబట్టి ఇది విద్యుత్ లేని గ్రామాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లోనూ, అరణ్యాల్లోనూ అమర్చవచ్చు.
ఎక్కడికైనా తీసుకెళ్లే సౌలభ్యం – డ్రోన్, హెలికాప్టర్, ప్యారాచూట్ కూడా సరి!
ఈ హాస్పిటల్‌ని వాహనాల్లో కాకుండా గాలిలో నుంచి డ్రోన్ లేదా హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ప్యారాచూట్ ద్వారా కూడా కిందకి వదిలేయవచ్చు. అంటే ఈ క్యూబ్ ఎక్కడైనా సులభంగా వెళ్తుంది, అక్కడికక్కడే సెటప్ అవుతుంది.
Also Read: India First AI Teacher: రోబో టీచర్ వచ్చేసింది.. ఇక క్లాసులన్నీ ఓ రేంజ్ బాస్
AIIMS మంగళగిరిలో ప్రదర్శన – వైద్య రంగంలో విప్లవం
ప్రస్తుతం ఈ భీష్మ్ హెల్త్ క్యూబ్‌ని మంగళగిరిలోని ఏఐఐఎంఎస్‌లో ప్రదర్శించారు. ఇక్కడ శిక్షణా, పరిశోధనల కోసం వినియోగిస్తున్నారు. త్వరలోనే దీన్ని సైన్యం, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్, ఎమర్జెన్సీ సర్వీసుల్లో భాగంగా వినియోగించే అవకాశాలున్నాయి.
భారత ఆవిష్కరణ
భారతదేశం అభివృద్ధి చేసిన ఈ భీష్మ్ హెల్త్ క్యూబ్, భవిష్యత్తులో వైద్య రంగంలో నూతన దిశలను తెరుస్తుంది. అతి తక్కువ సమయంలో, అత్యధిక సేవలందించే ఈ టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది.
భారత్ కేవలం డిజిటల్ ఇండియా మీదే కాకుండా, హెల్త్ టెక్నాలజీలోనూ ప్రపంచానికి మార్గం చూపిస్తోంది. భీష్మ్ హెల్త్ క్యూబ్ దానికి నిలువెత్తు ఉదాహరణ. ఇది భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికే ఉత్పత్తిగా నిలుస్తుందని వైద్యులు అంటున్నారు.
దీనిని బట్టి ఇకపై భీష్మ్ హెల్త్ క్యూబ్ సేవలు కానున్నాయని చెప్పవచ్చు. అంతేకాదు ఈ వైద్యశాల దేశ వ్యాప్తంగా ఎన్నో ప్రాణాలను కాపాడనుందని చెప్పవచ్చు. అంతేకాదు.. ప్రాణాపాయం సమయంలో ప్రతి క్షణం విలువైనది. అందుకే మన పరిశోధకులు దీనిని ఆవిష్కరించి, వైద్య చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారని చెప్పవచ్చు.