RRR : రాజద్రోహం కేసు పెట్టి ఎంపీ రఘురామకృష్ణ రాజును లోపలేసి కొట్టారు. లాఠీలు, రబ్బరు బెల్టులతో కుమ్మేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. మీదు కూర్చొని ముగ్గురు పోలీసులు చితకబాదారు. పెద్దలకు ఫోన్ చేసి వీడియో కాల్‌లో తనను చితక్కొట్టడాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఇదిగో చూడండి పాదాలు ఎలా కమిలిపోయాయో… ఇలా అప్పట్లో రఘురామ ఎంతగా మొత్తుకున్నా ఆయన గోడు ఎవరూ వినలేదు. జగన్ పాలనలో అంతగా అరాచకం రాజ్యమేలింది. సుప్రీంకోర్టుకు వెళ్లి తిప్పలు పడితే కానీ అతికష్టం మీద ఆనాడు ఆయనకు బెయిల్ వచ్చింది. సీబీసీఐడీ చెర నుంచి బయటపడి.. సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుని.. బతుకు జీవుడా అని బయటపడ్డారు. కట్ చేస్తే.. జగన్ పాలన అంతమై కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఆనాడు తనను కొట్టిన, కొట్టించిన ఒక్కొక్కరి పని పట్టే పనిలో ఉన్నారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు.
రఘురామ పాదాలకు గాయాలు.. రిపోర్టులో ఏముంది?
ఈ మొత్తం కేసులో కీలకమైన అంశం ఆయన ఒంటిపై ఉన్న దెబ్బలు. తన పాదాలకు అయిన గాయాలను చూపిస్తూ రఘురామా కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. ఆ ఫోటో చూస్తే చిన్నపిల్లలైనా చెప్పేస్తారు దారుణంగా కొట్టారని. కానీ, అప్పటి GGH సూపరింటెండెంట్ ప్రభావతి మాత్రం రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని రిపోర్ట్ ఇచ్చారు. ఆమె ఇచ్చిన మెడికల్ రిపోర్టుతో అప్పట్లో కోర్టులో RRRకు చాలా ఇబ్బంది ఎదురైంది. సుప్రీంకోర్టులో గట్టిగా వాదిస్తే.. ఆర్మీ వైద్యులతో మరోసారి టెస్ట్ చేయించారు. ఆర్మీ డాక్టర్లు మాత్రం రఘురామ కాళ్లకు తీవ్ర గాయాలు ఉన్నాయని.. ఆయన కాలి వేలు ఫ్యాక్చర్ అయిందని, పాదాలు, కాలి పిక్కలు కమిలిపోయాయని రిపోర్ట్ ఇచ్చారు. ఇదే అంశంపై లేటెస్ట్‌గా మళ్లీ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
డాక్టర్ ప్రభావతి విచారణకు రావాల్సిందే..
కస్టోడీయల్ టార్చర్‌లో RRRకు ఎలాంటి గాయాలు లేవని అప్పుడు నివేదిక ఇచ్చిన GGH సూపరింటెండెంట్ ప్రభావతి.. తప్పకుండా దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 7, 8 తేదీల్లో సంబంధిత పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. గతంలో ప్రభావతికి విచారణ నుంచి మధ్యంతర ఉపశమనం కల్పించింది సుప్రీం డివిజన్ బెంచ్. ఇప్పుడు మాత్రం దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఆసక్తికరం.
సుప్రీంకోర్టులో ఎవరి వాదన ఏంటంటే..
సుప్రీం చెప్పినా దర్యాప్తునకు ప్రభావతి సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే తనను ఒక్కసారే విచారణకు పిలిచారని, రెండు నెలల్లో మళ్లీ పిలుస్తామని పిలవలేదని ప్రభావతి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎప్పుడు నోటీసులు పంపినా ప్రభావతి తప్ప ఎవరో ఒకరు స్పందిస్తున్నారని ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాధించారు. ఏదో ఒక సాకు చూపి.. దర్యాప్తునకు హాజరుకావడం లేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభావతి విచారణకు తేదీలు ఫిక్స్ చేసింది. ఈనెల 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు విచారనకు హాజరుకావాలని ప్రభావతిని ఆదేశించింది. 2 రోజులు ఎంక్వైరీలో ప్రభావతి నుంచి లిఖితపూర్వకంగా అన్ని సమాధానాలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
Also Read : ప్రవీణ్ పగడాల మృతి కేసులో అసలు నిజాలు..
దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నా.. రఘురామ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని ఎలా రిపోర్ట్ ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎవరు ఒత్తిడి చేయడం వల్ల అలాంటి తప్పుడు నివేదిక ఇచ్చారు? దీని వెనుక ఎవరు ఉన్నారు? ఇలా ప్రతీ విషయం కూపీ లాగనున్నారు ఏపీ పోలీసులు. మరి, విచారణలో ప్రభావతి నిజాలు చెబుతారా? ఆనాటి పెద్దల పేర్లు బయటపెడతారా?