AP Real Love Story: ప్రేమకు హద్దులుండవు, ఎల్లలుండవు, వయస్సు కూడా ఉండదని ఇటీవల జరుగుతున్న ఘటనలను బట్టి చెప్పవచ్చు. పవిత్రమైన ప్రేమ ఎప్పుడూ ఓటమిని చవిచూడదు. అయితే ప్రేమ వేరు.. పెళ్లి వేరు. ప్రేమతో మొదలై పెళ్లి వరకు వెళ్లని ఎన్నో జంటలు ఉంటాయి. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకొని.. సాఫీగా తమ జీవితాన్ని సాగించే జంటలు కూడా ఉంటాయి. సేమ్ టు సేమ్ ఈ జంట అటువంటిదే. కానీ ఒకరు ఇండియన్ మరొకరు ఇటలీ. వీరిద్దరి దేశాలు వేరైనా, మనసులు కలిశాయి. పెళ్లి చేసుకున్నారు.. ఒక్కటయ్యారు. ఏకంగా తన ప్రియుడికి ఇటలీలో ఉపాధి కూడా దక్కేలా చేసింది ప్రియురాలు.
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం భక్తరహళ్లి జిల్లడగుంటకు చెందిన నరసింహమూర్తి, 1995లో పుట్టపర్తి శ్రీ సత్యసాయి మందిరంలో భక్తులుగా సేవలందించే వారు. ఈయన శ్రీ సాయి బాబాకు పర్సనల్ సెక్రెటరీగా కూడా పని చేశారు. అయితే బాబా దర్శనార్థం ఇటలీ నుండి కూడా భక్తులు వచ్చేవారు. అందులో ఎరికబెత్తి నెల్లి అనే యువతి కూడా ఒకరు. అక్కడ నరసింహమూర్తి మంచితనాన్ని గమనించిన ఎరికబెత్తి నెల్లి తన ప్రేమ విషయాన్ని నరసింహ మూర్తితో చెప్పారట.
కొద్ది రోజులు గడిచిన అనంతరం నరసింహమూర్తి ఓకే చెప్పేశారు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అప్పటికే కానిస్టేబుల్ గా కూడా విధులు నిర్వహించిన నరసింహమూర్తి, ప్రియురాలితో పాటు ఇటలీకి మకాం మార్చారు. ప్రస్తుతం ఇటలీ ఎయిర్ పోర్టులో సూపర్వైజర్ గా పనిచేస్తూ, పార్ట్ టైం యోగాధ్యాపకుడిగా కూడా ఆయన పనిచేస్తున్నారు. ప్రేమించారు.. పెళ్లి చేసుకున్నారు.. తన భర్తకు ఏకంగా ఉపాధి కూడా కల్పించింది ఈమె.
ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం భక్తరహళ్లి జిల్లడగుంట అంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ జంట స్వగ్రామానికి వచ్చింది. ఈ సంధర్భంగా వారు బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడి తమ ప్రేమ కబుర్లు చెప్పారు. నాలుగేళ్లకు ఒక్కసారి తాము గ్రామానికి వస్తామని, తప్పక బ్రహ్మోత్సవాలలో పాల్గొంటామని నరసింహమూర్తి తెలిపారు. అలాగే తన భార్య ఎరికబెత్తి నెల్లికి భక్తిభావం ఎక్కువని, మన సంప్రదాయాలను తప్పక పాటిస్తుందన్నారు. తాము ఇటలీలో కూడా భారతీయ సంప్రదాయాన్ని పాటిస్తామని ఎరికబెత్తి నెల్లి తెలిపారు.
Also Read: Naga Chaitanya- Shobhita: శోభిత ప్రేమ కోసం చైతూ అలాంటి పని చేశారా..?
ఏదిఏమైనా నేటి రోజుల్లో అలా ప్రేమ, ఇలా బ్రేకప్ చెప్పే జంటలు ఉన్న కాలంలో, ఈ జంట అందరికీ ఆదర్శమని చెప్పవచ్చు. పెద్దలు మనసు నొప్పించక, ప్రేమను పెళ్లిలా మలచుకొని ప్రియుడు వేలు పట్టి ఇటలీకి తీసుకెల్లడమే గాక, అక్కడ ఉపాధి కల్పించడం విశేషం. చివరగా తనకు దేవుడిచ్చిన వరమని ఎరికబెత్తి నెల్లి గురించి నరసింహమూర్తి చెప్పడం, వారి ప్రేమకు నిదర్శనంగా చెప్పవచ్చు.