Rs 700 cr Land Scam: ఏపీ భూ కుంభకోణంలో 700 కోట్ల రూపాయల దొపిడీ జరిగిందా? ఈ వ్యవహారాన్ని అధికారులే నడిపించారా? వైసీపీ పాలనలో తెరవెనుక సూత్రదారులను బయటకు వస్తారా? ఏసీబీ సోదాల వల్లే శ్రీకాంత్-రీతూచౌదరి మధ్య గొడవలు వచ్చాయా? సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రతీ పోస్టింగుకు మనీ లావాదేవీలు జరిగాయా? వైసీపీ ఆనాటి పెద్దల పాత్ర ఉందా? అవుననే అంటున్నాడు చీమకుర్తి శ్రీకాంత్.
ఏపీలో జరిగిన భూ కుంభకోణంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని వెనుక కర్మ, కర్త, క్రియ అనే చీమకుర్తి శ్రీకాంత్ తొలుత వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆనాటి వైసీపీ పెద్దల వైపు మళ్లింది. బీగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు బయటపెట్టాడు శ్రీకాంత్. తాను వేల కోట్లు రూపాయలు సంపాదించానని వస్తున్న వార్తలను ఖండించాడు. తాను అప్పుల చేసిన వాటికి ప్రస్తుతం తాను ఈఎంఐ కట్టలేని స్థితిలో ఉన్నానన్నాడు.
వైసీపీ ప్రభుత్వంలో అప్పటి పెద్దలు-ఏసీబీ-సబ్ రిజిస్ట్రార్ల మధ్య ఏం జరిగిందో పూసగుచ్చి మరీ వెల్లడించాడు. జగన్ హయాంలో ఏపీని దోచుకున్న మాట వాస్తవమేనన్నాడు. ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రతీ పోస్టింగ్ లావాదేవీల వెనుక అప్పటి ప్రభుత్వంలో నలుగురు పెద్దలు మాత్రమే కీలకంగా వ్యవహరించారని తెలిపాడు. సబ్ రిజిస్ట్రార్ల దగ్గర దోచుకునేది ఏసీబీకి చెందిన కొందరు అధికారులున్నారని పేర్లతో సైతం చెప్పుకొచ్చాడు.
అలాగే మాజీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి పెద్ద అవినీతి పరుడని మనసులోని మాట బయటపెట్టాడు శ్రీకాంత్. ఏమైనా విషయాలు బయటపెడితే తనను చంపేస్తామని జగన్ పీఏ కెఎన్ఆర్, సజ్జల బెదిరించారని, లెటర్ కూడా పంపించారని తెలియజేశాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీపై తనకు నమ్మకం లేదని కుండబద్దలు కొట్టేశాడు.
ALSO READ: సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో మార్పులు, రంగంలో కౌంటర్ యాక్షన్ టీమ్‌లు
సబ్ రిజిస్ట్రార్ అధికారి రామారావుకు ఏసీబీ జేడీకు మంచి పరిచయాలున్నాయని, ఏసీబీ చేసిన ప్రతీ సోదాల విషయం తొలుత ఆయనకు తెలుస్తుందన్నాడు. తనకు సబ్ రిజిస్ట్రార్లకు ఎలాంటి సంబంధాలు లేవన్నాడు. తాము విదేశాలకు వెళ్లామని వచ్చిన ఆరోపణలపైనా నోరు విప్పాడు. పాస్ పోర్టులు పరిశీలిస్తే రామారావు-ధర్మసింగ్ ఎన్నిదేశాలకు వెళ్లారో తెలుస్తుందన్నాడు. తాను ఇండియాకు దాటి వెళ్లలేదన్నాడు.
ఏసీబీ సోదాల వల్లే రీతూచౌదరికి-తనకు గొడవలు వచ్చాయన్నాడు చీమకుర్తి శ్రీకాంత్ ఆమెకు లేనిపోనివి చెప్పి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. భూ కబ్జాలు, రిజిస్ట్రేషన్లతో రీతూ చౌదరికి ఎలాంటి సంబంధం లేదన్నాడు. అమ్మాయిలతో వ్యాపారం, అప్‌కమింగ్ హీరోయిన్లతో బిజినెస్ వ్యవహారాలు ఏ మాత్రం నిజం కాదన్నాడు.
ఇండస్ట్రీలో చాలామందితో తనకు పరిచయాలున్నాయని చెప్పాడు శ్రీకాంత్. రీతూ-తనది లవ్ మ్యారేజ్ అని, డైవోర్స్ వ్యవహారం ఇంకా నడుస్తోందన్నాడు. ఒక ప్రాపర్టీ మాత్రమే ఆమె మీద రాశానని వెల్లడించాడు. రీతూకు ఆఫీసర్లకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. తన సంపాదనంతా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినదేనని తేల్చి చెప్పాడు.
తనకు వందల కోట్లు ఆస్తులు ఏమీ లేవని, వాటిని నిరూపించాలని సవాల్ విసిరాడు. ముఖ్యంగా వైసీపీ నేతలతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవన్నాడు. సజ్జల, ధనుంజయ్‌రెడ్డి, కేఎన్ఆర్ మొదలైనవారితో సబ్ రిజిస్ట్రార్లకు మంచి సంబంధాలు ఉన్నమాట వాస్తవమేనని వెల్లడించాడు. శ్రీకాంత్ ఇంకా ఏమన్నాడో ఆయన మాటల్లో ఓసారి చూద్దాం.