Bomb Threat: విజయవాడ బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామని అగంతకులు కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన నగర పోలీసులు బీసెంట్ రోడ్డు మొత్తాన్ని ఖాళీ చేయించి తనిఖీలు చేస్తున్నారు. నిత్యం లక్షలాది మంది వ్యాపారులు, కొనుగోలు దారులతో రద్దీగా ఉంటుంది బీసెంట్ రోడ్డు. అలాంటి చోట బాంబు ఉందంటూ ఫోన్ రావడంతో వ్యాపార సముదాయాలను క్లోజ్ చేయించి బాంబు స్వ్కాడ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది.
ఇటీవల ఏపీలో పలు బాంబు బెదిరింపులు నమోదయ్యాయి. తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు మెయిల్‌లో బెదిరింపులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు.
ఇదిలా ఉంటే.. విజయనగరం ఉగ్ర కేసులో రెండోరోజు, నిందితులు సిరాజ్, సమీర్‌లను ప్రశ్నిస్తున్నారు. ATS, NIA, ఇంటలిజెన్స్ అధికారులు. నిన్న ఇద్దరికీ ఒకే తరహా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఉగ్రవాద సంబంధాలు, పేలుడు పదార్థాల కొనుగోలు, ఆర్థిక వనరులు సమకూర్చిన వారి పేర్లు అడిగారు. పేలుళ్ల కుట్రను ఎక్కడ? ఎప్పుడు? ఎలా? అమలు చేసేందుకు ప్లాన్ చేశారని ఇద్దరినీ ప్రశ్నించారు. కొన్ని ప్రశ్నలకు సిరాజ్ ముక్తసరిగా సమాధానాలు చెప్పాడు. MLA రాజాసింగ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే.. తెలియని నెంబర్ నుంచి శభాష్ అని మెసేజ్ వచ్చిందని… రిమాండ్‌లో ఉన్న సమయంలోనే సిరాజ్ జైలు అధికారులతో చెప్పాడు. అప్పటి నుంచి ఆ నెంబర్‌కు కాల్ చేసి తరచూ మాట్లాడానని, తనతో మాట్లాడిన వ్యక్తి చాలాసార్లు డబ్బు పంపాడని సిరాజ్ చెప్పాడు. అతను తనను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి ఉగ్రదాడులపై శిక్షణ కూడా ఇప్పించాడని చెప్పాడు.
Also Read: వంశీకి సీరియస్.. అర్ధరాత్రి హాస్పిటల్‌కు భార్య..
విచారణ అధికారిగా విజయనగరం డీఎస్పీని నియమించారు. ఈటీమ్‌లో విజయనగరం టౌన్ ఎస్సై, రూరల్ సీఐ, భోగాపురం సీఐ ఉండనున్నారు. NIA ఆధ్వర్యంలోనే విచారణ కొనసాగనుంది. నవంబర్ 22న సిరాజ్, సమీర్ ముంబై వెళ్లారు. ముంబైలో ఏం చర్చించారన్నదానిపై విచారించే ఛాన్స్ ఉంది. ఇక నవంబర్ 23న సిరాజ్ ఒక్కడే మరో వ్యక్తిని కలిశాడు. మతఘర్షణలకు సంబంధించి అతడితో చర్చించినట్లు సమాచారం. సూసైడ్ బాంబర్‌గా సిరాజ్ మారడానికి ఎవరు మోటివేట్ చేశారనే కోణంలో ప్రశ్నించే అవకాశం ఉంది.