Vallabhaneni Vamsi Health: బెయిల్ వచ్చినా మిగితా కేసుల్లో జైలుకే పరిమితమైన వల్లభనేని వంశీకి ఏమైంది? అనారోగ్యాలు చుట్టుముట్టాయా? జైలు జీవితం పడడం లేదా? వంశీ హెల్త్ కండీషన్ డేంజర్ లో ఉందా? అంటే అవునన్న సమాధానమే వస్తోంది. అనారోగ్య కారణాలతో ఇప్పటికే వంశీ 20 కేజీల బరువు తగ్గారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బడి పడుతున్నట్లు గుర్తించి జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి సిబ్బంది తరలించారు. అక్కడ టెస్టులు చేయగా.. వంశీ శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. CT స్కాన్ తో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన టెస్టులు చేశాక.. మళ్లీ విజయవాడ సబ్ జైలుకు తరలించారు అధికారులు.
ఇక తాజాగా వల్లభనేనీ వంశీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో రాత్రి ఆయన్ని కంకిపాడు పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఊపిరి తీసుకోవడానికి వంశీ ఇబ్బంది పడ్డారు. స్టేషన్‌లో వాంతులు చేసుకున్నారని వైద్యులు గుర్తించారు. వంశీ భార్య అర్థరాత్రే కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.
వంశీ ఆరోగ్యంపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్ట్ వద్ద వంశీ భార్య పంకజ శ్రీ కొన్ని కామెంట్లు చేశారు. శ్వాసకోస సమస్యలు, కాళ్లవాపు కారణంగా వంశీని హాస్పిటల్ కి తీసుకెళ్లారని, హిమోగ్లోబిన్ తక్కువ ఉందన్నారు. వాతావరణం కారణంగా ఇబ్బంది పడుతున్నారని, ఇన్హెలర్ ఇచ్చారన్నారు. వంశీకి వెన్ను నొప్పి సమస్య ఉందని, కింద పడుకోవడం ఇబ్బంది ఉండడంతో మంచం ఇవ్వాలని పిటిషన్ వేస్తే.. కోర్టు బల్ల మంజూరు చేసిందన్నారు. తన ఆరోగ్య సమస్యలను న్యాయమూర్తి దృష్టికి వంశీ తీసుకొచ్చారని, ఆరోగ్య సమస్యలపై పిటిషన్ వేయమని కోర్ట్ చెప్పిందన్నారు పంకజశ్రీ.
సత్యవర్థన్ కేసులో వల్లభనేని వంశీకి మంగళవారం రోజున బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు. సత్యవర్థన్ కిడ్నాప్, దాడి, తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించారన్న ఆరోపణలతో పోలీసులు వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఇందులో భాగంగా గత ఫిబ్రవరిలో వంశీని అరెస్ట్ చేశారు. తాజాగా వంశీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన ఘటనలో వంశీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులో ఇంకా వంశీకి బెయిల్ మంజూరు కాలేదు. దాంతో రిమాండ్‌లోనే ఉన్నారు. మొత్తం వంశీపై 6 కేసులు నమోదు కాగా, 5 కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన జైలుకే పరిమితం అయ్యారు. బెయిల్ వస్తూనే ఉన్నాయి. ఆ వెంటే కొత్త కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే జైలు నుంచి బయటకు రావడం లేదు వంశీ.
Also Read: ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన.. ఏడుగురు కేంద్రమంత్రులతో కీలక చర్చలు..!
కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై మాజీమంత్రి పేర్నినాని ఆరా తీశారు. శ్వాసకోశ సమస్యలతో పోలీస్ కస్టడీలో ఉన్న వల్లభనేని వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని పేర్నినాని ఆరోపించారు. వంశీ టీడీపీలో ఉన్నప్పుడు జరిగినా ఆనాడు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పార్టీ మారేసరికి ఇప్పుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.