Kochi Accident: తెల్లవారుజామున రోడ్డు మీద కనిపించే వాహనాల శబ్దం కొందరికి ప్రయాణపు హడావుడిని గుర్తు చేస్తే, మరికొందరి ఇళ్లలో మాత్రం అది తీరని శోకాన్ని మిగులుస్తుంది. కేరళలోని కొచ్చి విమానాశ్రయం సమీపంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు నిండు ప్రాణాలను బలిగొంది. చదువుల నిమిత్తం వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఆ విద్యార్థుల కలలు ఆ రాత్రి రోడ్డుపైనే అస్థిరమైపోయాయి.
రాత్రి రెండు గంటల సమయంలో పెను విషాదం
కేరళలోని ఎర్నాకుళం జిల్లా నెడుంబాస్సేరి ప్రాంతంలో అర్ధరాత్రి దాటాక ఒంటిగంట దాటిన సమయం అది. స్థానిక దుకాణంలో టీ తాగి, తమ స్కూటర్‌పై గదికి తిరిగి వెళ్తున్న ముగ్గురు విద్యార్థులపైకి ఒక అతివేగంగా దూసుకొచ్చిన మినీ కూపర్ కారు మృత్యువులా ముంచుకొచ్చింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో స్కూటర్ నుజ్జునుజ్జయింది.
ముగ్గురు యువతీయువకుల దుర్మరణం
ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను వయనాడ్‌కు చెందిన దేవిక, పాలక్కాడ్‌కు చెందిన గోపిక, కర్ణాటకకు చెందిన ఇజాజ్‌గా గుర్తించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి ఉన్నత విద్య కోసం వచ్చి, మంచి భవిష్యత్తును ఊహించుకుంటున్న ఆ యువతీయువకుల మరణ వార్త వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
నిలదీస్తే అహంకారపు సమాధానం
ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ 19 ఏళ్ల సుహైల్ సజీవ్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందాల్సింది పోయి, ‘మా నాన్నే అన్నీ చూసుకుంటాడులే’ అంటూ ఆ యువకుడు చూపిన తలపొగరు స్థానికుల్లో మరింత ఆగ్రహం తెప్పించింది. డబ్బు, హోదా ఉంటే ప్రాణాలకు విలువుండదా అని ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: విశాఖలో ఎన్నికల సందడి.. నోటిఫికేషన్‌కు ముందే అధికారుల స్పీడ్!