BPCL – AP : ఏపీని పెట్టుబడులకు కేంద్రంగా మార్చాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా కొలిక్కివస్తున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో రూ.రూ.95 వేల కోట్లతో భారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారత ప్రభుత్వ ఆయిల్ రిఫైనరీ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ.. ఏపీలో భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి ప్రదర్శించింది. దాంతో.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందిస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించిన కూటమి ప్రభుత్వం.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీయ.. మూడు ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించాలని నిర్ణయించింది. ఇటీవలే.. దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడ ఐటీ పరిశ్రమల్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు. దేశీయంగానూ బడా సంస్థలతో చర్చలు జరుపుతోంది. వీటి ఫలితంగానే రాష్ట్రానికి వచ్చేందుకు వివిధ సంస్థలు ప్రాథమిక స్థాయి చర్చలు ప్రారంభించగా, వాటిలో బీపీసీఎల్ ఒకటి. ఈ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడును కలిసి.. భూ కేటాయింపులు, అనుమతులు వంటి విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దేశంలోని అతిపెద్ద రిఫైనరీని నెలకొల్పేందుకు బీపీసీఎల్ నిర్ణయించగా, ఇందుకు.. దాదాపు రూ.95 వేల కోట్ల వ్యయం కానుందని తెలుస్తోంది. కాగా.. ఈ ఆయిల్ రిఫైనరీని నెల్లూరు జిల్లా రామాయపట్నంలో ఏర్పాటు చేయనున్నారు. దాంతో.. నెల్లూరు జిల్లాల్లో వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే.. ఈ రిపైనరీ ఏర్పాటుకు దాదాపు 6 వేల ఎకరాలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించాలని భావిస్తున్న చోట అటవీ భూములు సైతం ఉండడం, పర్యావరణ అనుమతులు తప్పనిసరి అయిన నేపథ్యంలో.. కేంద్రానికి దరఖాస్తు చేశారు. అటవీశాఖ, పర్యావరణశాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉంది.
ఇప్పటికే.. కేంద్ర ప్రభుత్వ శాఖలు ఈ సిఫార్సులను పరిశీలిస్తున్నాయి. కాగా.. కేంద్ర పర్యావరణ శాఖ ఆరు నెలల పాటూ సర్వే నిర్వహిస్తుందని బీపీసీఎల్ ప్రతినిధులు తెలిపారు. ఈ సర్వే మార్చి నెలలో ప్రారంభమై ఆగస్టు నెల వరకు సాగే అవకాశాలున్నాయి. ఆ తర్వాతే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు ఇస్తుంది. భారీ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. అటవీ, పర్యావరణ అనుమతుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అంటున్నారు. అన్ని పూర్తయితే.. బీపీసీఎల్ రిఫైనరీకి ఈ ఏడాది డిసెంబరులో శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు.
ఈ భారీ రిఫైనరీని బీపీసీఎల్, సౌదీ అరేబియా ప్రభుత్వ రంగ సంస్థ సౌదీ ఆరాంకో భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.95 వేల కోట్లు వ్యయం అవసరమని అంచనాలు రూపొందిస్తున్నారు. కాగా.. ఈ ప్రాజెక్టు రూపదాల్చితే ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని భావిస్తున్నారు.