Case on Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణలో కేసు నమోదైంది. పవన్ చేసిన కామెంట్స్ తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని తెలుపుతూ పలువురు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకు ఫిర్యాదు చేసిందెవరు? అసలు ఫిర్యాదుకు దారి తీసిన కారణాలు ఏమిటో చూద్దాం.
పవన్ ఏం చెప్పారంటే..
ఇటీవల కాశ్మీర్ ఉగ్రదాడిలో 26 మంది మన వారు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ ఆ దాడికి ప్రతీకార చర్యనే. అయితే ఆ ఉగ్రదాడి జరిగిన సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. అలాగే ఏపీకి చెందిన ఇరువురు ఉగ్రదాడిలో మృతి చెందడంతో పవన్ ఆ కుటుంబాలను పరామర్శించారు. అంతేకాదు మధు సూధన్ రావు కుటుంబానికి రూ. 50 లక్షలు అందజేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆ సమయంలో పవన్, పాకిస్తాన్ పై విరుచుకు పడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ కాలం వెళ్లదీస్తున్న పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పాలని పవన్ ప్రసంగించారు. అలాగే మన దేశంలో ఉంటూ పాక్ కు మద్దతు తెలపడం ఎంత వరకు సమంజసమని పవన్ ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోమని పవన్ హెచ్చరించారు.
సోషల్ మీడియాలో పవన్ కామెంట్స్ వైరల్..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ మాత్రం శత్రుదేశం పాకిస్తాన్ ను దృష్టిలో ఉంచుకొని కామెంట్స్ చేస్తే, కొందరు దానిని పక్కదారి పట్టేలా కామెంట్స్ చేశారన్న రీతిలో వైరల్ చేశారు. ఒక మతాన్ని కించపరుస్తూ పవన్ కామెంట్స్ చేశారని కొందరు వైరల్ చేయగా, ఇదే విషయంపై జనసేన సైతం స్పందించింది. పవన్ కామెంట్స్ ను వక్రీకరించడం తగదని, అలాంటి న్యూస్ వైరల్ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జనసేన హెచ్చరించింది.
తెలంగాణలో పవన్ పై కేసు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ముస్లింలను ఉగ్రవాదులతో సమానంగా చూపుతూ ఆయన కామెంట్స్ చేశారని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
ముస్లింలపై ద్వేషపూరిత ప్రచారం అంటూ ఆరోపణ
జహీరాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖాజా ఆధ్వర్యంలో ముస్లింలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ వంద శాతం ముస్లింలు ఉగ్రవాదులే అన్నట్లు మాట్లాడినట్లు ఆరోపిస్తూ, ఇది ద్వేషపూరిత ప్రకటనగా వారు అభివర్ణించారు. ముస్లింల సంప్రదాయ దుస్తులైన టోపీ, గడ్డం, కుర్తా, స్కార్ఫ్ వంటి అంశాలను ఉగ్రవాదానికి చిహ్నాలుగా పవన్ ప్రస్తావించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ముస్లిం సమాజాన్ని అపహాస్యం చేయడమే కాకుండా, దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలుగా ఫిర్యాదిదారుడుఅభివర్ణించారు.
Also Read: DSC Crash Course: 11వ తేదీ లాస్ట్ డేట్.. మీరు అప్లై చేశారా? లేకుంటే వేలల్లో ఖర్చు..
డిమాండ్ ఇదే..
పవన్ కళ్యాణ్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులు తగిన న్యాయ ప్రక్రియను మొదలుపెట్టాలని ఖాజా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఇంకా పవన్ కళ్యాణ్ స్పందించలేదని చెప్పవచ్చు. అయితే సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. కాగా ఆపరేషన్ సింధూర్ సంధర్భంగా పవన్ మాట్లాడుతూ.. దేశ ద్రోహులకు సోషల్ మీడియా లో సరైన సమాధానం చెప్పాలని, పోలీస్ అధికారులకు ఫిర్యాదులు చేయాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్మీ పై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని, పార్టీలతో సంబంధం లేకుండా దేశ ప్రజలు అంతా ప్రధాని మోదీ కి సపోర్ట్ గా ఉండాలని కోరారు. తాను గతంలో చేసిన కామెంట్స్ అందరినీ ఉద్దేశించి మాట్లాడలేదని, కొద్ది మంది కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడానని పవన్ క్లారిటీ ఇచ్చారు.