
Avinash Reddy Latest News (AP Updates) : అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్‌పై హైకోర్టులో వాదనలు వాడివేడిగా జరిగాయి. విచారణకు వస్తే అవినాశ్‌ను అరెస్ట్ చేస్తారా? అంటూ కోర్టు ప్రశ్నించింది. అవసరమైతే అరెస్ట్ చేస్తామంటూ సీబీఐ చెప్పడంతో ఏదో జరగనుందనే అనుమానం మొదలైంది. మరోవైపు, ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తన వాదనలు కూడా వినాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు అవినాష్‌రెడ్డిని విచారణకు పిలవాలని సీబీఐకి సూచించింది.
బెయిల్ పిటిషన్ లో సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయంగా దెబ్బ తీసేందుకే కుట్ర చేస్తున్నారని అన్నారు. వైఎస్ వివేకాకు మహిళలతో ఉన్న వివాహేతర సంబంధాలే హత్యకు దారితీశాయన్నారు. సునీల్ యాదవ్ తల్లితో పాటు ఉమాశంకర్ రెడ్డి భార్యతో వివేకాకు సంబంధం ఉందని.. వాళ్ల ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు వివేకా వెళ్లేవాడంటూ సంచలన విషయాలు బెయటపెట్టాడు అవినాష్‌రెడ్డి. వివేకా హత్యకు ముందు ఆయన రెండో భార్య షమీమ్.. కొడుకు షహెన్ షా పేరిట ఉన్న పత్రాలు తీసుకున్నారని.. అప్రూవర్ గా మారిన దస్తగిరి ఈ విషయాన్నిసీబీఐకు చెప్పాడన్నారు.
వివేకా రెండో భార్య విషయంలో ఆయన కుటుంబంలో వివాదాలు ఉన్నాయంటూ.. చెప్పుకొచ్చారు అవినాష్. షమీమ్ , సునీతకు మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. కుటుంబ తగాదాల నేపథ్యంలోనే షమీమ్ ను.. సునీత, ఎర్ర గంగిరెడ్డి చాలాసార్లు బెదిరించారని ఆరోపించారు. షమీమ్ కొడుకును HPSలో చేర్పిస్తానని వివేకా మాట ఇచ్చారని..ఆ స్కూల్ పక్కనే విల్లా కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశారని చెప్పారు. షమీమ్ కు ఇబ్బంది లేకుండా ఉండటానికి భారీగా డబ్బు ఫిక్స్ చేస్తానని వివేకా హామీ ఇచ్చారని.. ఈ విషయం తెలియడంతో వివేకా చెక్ పవర్ ని ఆయన కుటుంబ సభ్యులు రద్దు చేశారంటూ ఆరోపించారు అవినాష్ రెడ్డి. డబ్బులు లేక ఇబ్బంది పడటంతో.. వివేకా ల్యాండ్ సెటిల్ మెంట్లు, డైమండ్ బిజినెస్ మొదలుపెట్టారని.. ఈ బిజినెస్ లో ఏ1 నుంచి ఏ4 వరకు వివేకాకు సహాయపడ్డారన్నారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని.. వివేకా ఇంట్లో నుంచి ఆస్తి పత్రాలు తీసుకెళ్లడం చూస్తే.. ఏదో లాభం కోసమే హత్య జరిగినట్టు తెలుస్తోందందన్నారు అవినాష్. సీబీఐ మాత్రం ఆ విషయంలో దర్యాప్తు చేయకుండా కుట్ర పూరితంగా తనను టార్గెట్ చేస్తోందంని ఆరోపించారు అవినాష్ రెడ్డి.
ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. తాజాగా నిందితుల జాబితాలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేరును చేర్చింది. ఇప్పటివరకు ఈ కేసులో అవినాష్‌రెడ్డిని హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో నాలుగుసార్లు విచారించింది. అయితే ఆ సమయంలో సాక్షిగానే వాంగ్మూలాలు నమోదు చేసింది. ఇక ఇన్నిరోజులు అవినాష్ రెడ్డిని సీబీఐ సాక్షిగా విచారణకు పిలిచింది. వాంగ్మూలం తీసుకుని వదిలేసింది. అయితే భాస్కర్ రెడ్డి అరెస్టు రిపోర్టులో మాత్రం అవినాష్ రెడ్డిని సహనిందితుడిగా చేర్చింది. దీంతో సీబీఐ ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని నిర్ధారించుకుంది. హత్య తర్వాత సహనిందితులు శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, ఉదయ్ కుమార్, అవినాష్ రెడ్డితో కలిసి ఆధారాలు చెరిపేయడంలో భాస్కర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని అభియోగం మోపారు. దీంతో తొలిసారిగా అవినాష్ రెడ్డి నిందితుల జాబితాలో ఉన్నట్టు తేలిపోయింది.
అటు వైసీపీ ముఖ్యనేతలతో సీఎం జగన్ అత్యవసరంగా సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. సీఎం అనంతపురం పర్యటన, అధికారిక సమీక్షలు రద్దుతో పాటు మాజీ మంత్రి వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి అరెస్ట్, ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ ముందు హాజరు కానుండటం తదితర ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.