TTD Chairman: భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా సహించను. కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగాలి. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు ముందస్తుగా తీసుకోండంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడుకు టీటీడీ ఈవో శ్యామల రావు అందించి ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను తిరుపతి శ్రీ పద్మావతీ అతిథి గృహంలో అందించారు.
శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు వివరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వి.వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇక కార్తీకమాసం ఎఫెక్ట్ తిరుమలలో కనిపిస్తోంది. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.
Also Read: Rasi Phalalu Nov 17: ఏ ఏ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందంటే ?
కార్తీక మాసం ఎఫెక్ట్.. తిరుమలలో రద్దీ
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 73,179 మంది భక్తులు దర్శించుకోగా.. 25,602 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 4.03 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే 17 కంపార్ట్ మెంట్ లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది.