Chandrababu : వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేత ఘటనపై ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం దిక్కుమాలిన పనులు చేస్తోందని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ చేసిన తప్పులు 100 దాటిపోయాయని ఆరోపించారు. ఇక ప్రభుత్వ పతనమే మిగిలిందని విమర్శించారు. ఏపీ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు,అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. 600 ఇళ్లు ఉన్న ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రోడ్డు విస్తరిస్తారా? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ అసలు ఏనాడైనా రోడ్లు వేసిందా అని చంద్రబాబు నిలదీశారు. జనసేన అధినేత పవన్ పర్యటన అడ్డుకుంటేనో, టీడీపీ నేతల పర్యటన సమయంలో రాళ్లు వేస్తేనో పైచేయి సాధించలేరని హితవు పలికారు. కూల్చడం మాని ఏదైనా నిర్మించి చూడాలన్నారు. అప్పుడు ఆ తృప్తి ఎలా ఉంటుందో తెలుస్తుందని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు.