Nagababu: చంద్రబాబు కేబినెట్‌లో స్వల్ప మార్పులు జరగనున్నాయా? ఒకరు లేదా ఇద్దరిపై వేటు ఖాయమా? కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ గురించి ముందే సమాచారం ఇచ్చారా? తూర్పులో ఓ మంత్రిపై వేటు పడడం ఖాయమా? నాగబాబు మంత్రిగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
సంక్రాంతికి ముందు చంద్రబాబు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. దీనికి సంబంధించి నేతలకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పని తీరు సరిగా లేదని ఒకరు లేదా ఇద్దరిపై వేటు పడడం ఖాయమనే సంకేతాలు నేతల్లో బలంగా వినిపిస్తోంది.
మంత్రులు జిల్లాలకు వెళ్లకపోవడం ఒకటైతే, పని తీరు సరిగా లేనివారిని దూరంగా పెట్టాలనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పద్దతి మార్చుకోవాలని పదేపదే చెప్పినా ఎలాంటి మార్పు కనిపించకపోవడం తో కొందరు మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారట సీఎం చంద్రబాబు.
మంత్రులకు హనీమూన్ సమయం అయిపోయిందని అన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు గడిచిపోయింది. మంత్రుల పనితీరుపై నివేదికలు తెచ్చించుకున్నారు. ఈ నేపథ్యంలో సరిగా పని చేయని ఒకరిద్దిరికి ఉద్వాసన పలకం ఖాయమంటూ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ALSO READ: అల్పపీడనం ఎఫెక్ట్.. మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..
మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్‌కు ఉద్వాసన పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా సీనియర్ నేతలతో ఆయనకు పొసగలేదని తెలుస్తోంది. మంత్రిగా కూడా పర్పార్మెన్స్ చూపలేదని చెబుతున్నారు. వారి స్థానంలో సీనియర్ నేతలకు ఛాన్స్ ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం. తొలిసారి మంత్రివర్గంలోకి కొత్తవారిని తీసుకున్నారు. ఆయా శాఖలను సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు.. చంద్రబాబు మంత్రివర్గం లోకి అడుగుపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ముహూర్తం పెట్టేసుకున్నారు. జనవరి 8న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కేబినెట్‌లో పలువురు శాఖలు మారే అవకాశమున్నట్లు చెబుతున్నాయి.
మరోవైపు సహకార సంస్థలు, మార్కెట్ కమిటీల పదవులు భర్తీ జనవరిలో చేసేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 10 వేల పదవులు కేటాయించనున్నారట. ముఖ్యంగా వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల లోపే నామినేటెడ్ పదవులు ప్రక్రియ పూర్తి చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు.
జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలు పరిశీలించి, పదవులు ఇచ్చే బాధ్యతలను ఇన్‌ఛార్జ్ మంత్రులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. సెకండ్ ఫేజ్‌లో జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెటింగ్ సంస్థలకు పాలక వర్గాలను నియమిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర సహకార బ్యాంకు పాలక మండలిని ఎంపిక చేయనున్నట్లు పార్టీ వర్గాల మాట.
దీనికితోడు వ్యవసాయేతర సంఘాల పదవులు కూడా వీలైనంత త్వరగా భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల కాల పరిమితితో నామినేటెడ్ పాలక వర్గాలను నియమించనున్నారు. రాష్ట్రంలో 222 మార్కెట్ కమిటీలున్నాయి. కమిటీలో ఛైర్మన్ సహా 15 మంది సభ్యులుంటారు. ఆ పదవుల్లో సగానికిపైగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన.