Japan Christmas Valentine| ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సార్వత్రిక సందేశాలైన ప్రేమ, క్షమాగుణాలను గుర్తు చేసుకుంటారు. ప్రార్థనలు, ఊరేగింపులు, విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్న చర్చీలు, ఇళ్లు, వీధులతో సర్వత్రా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. అయితే, జపాన్ ప్రజలకు మాత్రం క్రిస్మస్ అంటే రెండో వాలంటైన్స్ డే. అక్కడి యువ జంటలకు ఇదో రోమాంటిక్ సందర్భం. ప్రేమికులు ఈ రోజు తమ ప్రేమకు అంకితం చేస్తారు.
చలికాలంలో వచ్చే క్రిస్మస్ పర్వదినాన్ని అక్కడి ప్రేమికులు రెండో వాలెంటైన్స్ డేగా భావిస్తారు. పని ఒత్తిడి, కుటుంబబాధ్యతలతో నిత్యం బిజీగా గడిపే జంటలకు ఒకరి సమక్షంలో మరొకరు సేదతీరేందుకు లభించిన మరో అద్భుత అవకాశం. యువతలో ఈ ట్రెండ్‌ను అక్కడి రెస్టారెంట్లు, షాపింగ్ సెంటర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటాయి. ప్రత్యేక డిన్నర్ ఏర్పాట్లు, డిస్కౌంట్ ఆఫర్లతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. వీధులన్నీ యువ జంటల కువకువలతో కళకళలాడుతుంటాయి. ఈ హడావుడితో జపాన్‌లో ఓ పండగ వాతావరణం నెలకొంటుంది.
Also Read: శాంతా క్లాజ్ ఏ దేశంలో ఉంటాడో తెలుసా?.. సమాధానం దొరికేసింది
‘‘ఈ రోజున జపాన్‌లో ఓ రొమాంటిక్ వాతావరణం కనిపిస్తుంటుంది. రాత్రి చీకటి పడగానే వీధులన్నీ విద్యుత్ అలంకరణలతో వెలుగులీనుతాయి. ఈ వెలుగుల జిలుగుల మధ్య యువ జంటలు డేట్స్‌పై వెళ్లేందుకు ఇష్టపడతాయి. యువ జంటల ప్రేమలు చిగురించేందుకు ఇది అత్యంత అనుకూలమైన సమయం’’ అని న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో ప్రొఫెసర్ రాయ్ స్టార్స్ వ్యాఖ్యానించారు.
124 మిలియన్ జనాభా కలిగిన జపాన్‌లో క్రైస్తవాన్ని కేవలం 1 శాతం మందే అనుసరిస్తారు. కానీ, యువజంటల కారణంగా దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తుంటారు.
‘‘జపనీయుల దృష్టిలో క్రిస్మస్‌కు ఎటువంటి మతపరమైన ప్రాముఖ్యతా ఉండదు. వారి దృష్టిలో ఇదో సాంస్కృతిక సంరంభం. పాశ్చాత్యుల నుంచి దిగుమతి చేసుకున్న ఓ సంప్రదాయం. జపనీయులు ఏ అంశమైనా చూపరులను ఆకట్టుకునేలా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి వారికి క్రిస్మస్ వెలుగుల అలంకరణలు, శాంటా క్లాస్ బొమ్మలు, క్రిస్మస్ మార్కెట్లు, రంగుల కాగితాల్లో చుట్టిన బహుమతులు వంటివన్నీ ఆకర్షణీయంగా కనిపిస్తాయి’’ అని ప్రొఫెసర్ స్టార్స్ వివరించారు. ఏ వస్తువైనా, పరిసరాలైన చూపులకు అందంగా ఉండాలన్నది జపాన్ సమాజం అనుసిరించే ప్రధాన సూత్రం. కాబట్టి, ఈ రోజును అక్కడి జంటలు తమ బంధాన్ని మరింత పదిల పరుచుకునేందుకు ఓ అవకాశంగా చూస్తాయని సదరు ప్రొఫెసర్ వివరించారు.
ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.3 బిలియన్ మంది రోమన్ కాథలిక్కులు పోప్ ఫ్రాన్సిస్ సారథ్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో క్రీస్తు పుట్టినరోజును జరుపుకున్నారు. ఇక వాటికన్ సిటిలోని సెయింట్ పీటర్స్ బెసీలికాలో పోప్ నేతృత్వంలో భారీస్థాయిలో క్రీస్మస్ ప్రార్థన కార్యక్రమం జరిగింది. ఇవి ఆయన సారథ్యంలో జరుగుతున్న 12వ క్రిస్మస్ వేడుకలు. ఈ సందర్భంగా ఆయన 2025 కాథలిక్ పవిత్ర సంవత్సరానికి నాంది పలికారు. దీంతో, వచ్చే ఏడాది క్రిస్మస్ వేడుకలకు 32 మంది క్రైస్తవులు రోమ్‌ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రీస్తు సందేశాలైన శాంతి, ప్రేమలను గుర్తు చేసుకుంలూ క్రీస్తు నామస్మరణలో తరించారు.