AP News: చాన్నాళ్లు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ యాక్టివ్ అయ్యింది. ఇప్పుడిప్పుడే సీబీఐకి కేసులు అప్పగిస్తున్నారు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు. తాజాగా కర్నూలు జిల్లా మైనర్ సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ సుగాలి ప్రీతి కేసు ఏంటి? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..
కర్నూలులో కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాల హాస్టల్‌లో పదో తరగతి చదువుతుంది సుగాలి ప్రీతి. ఏం జరిగిందో తెలీదుగానీ ఓ రోజు ప్రీతి ఫ్యాన్‌కు వేలాడుతూ హాస్టల్ గదిలో కనిపించడం పెను సంచలనం రేపింది. యువతిపై వేధింపులకు పాల్పడి చంపేశారని 2017 ఆగస్టు 19న కర్నూలు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీసీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.
అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. పాఠశాల యాజమాన్యం జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, దివాకర్‌రెడ్డిలను నిందితులుగా పేర్కొన్నారు. ఆ తర్వాత దాఖలు చేసిన ఛార్జిషీటులో అత్యాచారం, హత్య వంటి సెక్షన్లు తొలగించారు. నిందితులు యువతి ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పారని పేర్కొంటూ కొత్తగా ఓ సెక్షన్‌ను పొందుపరిచారు.
ఈ వ్యవహారంపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. అత్యాచారం, హత్య జరిగినట్లు పోస్టుమార్టం నివేదికల్లో ఉన్నప్పటికీ నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. 2019లో వైసీపీ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగించింది. అయినప్పటికీ ఈ కేసు ఒక్క అడుగు ముందుకు పడలేదు.
ALSO READ: లవ్ మ్యారేజ్ కి ఒప్పుకోలేదని, సెల్ టవర్ ఎక్కిన యువకుడు
కావాలనే ఈ కేసును అప్పటి వైసీపీ ప్రభుత్వం దర్యాప్తును నీరు గార్చేందనే ఆరోపణలు లేకపోలేదు. రీసెంట్‌గా సుగాలి ప్రీతికి న్యాయం చేయకుంటే జనసేన ఆఫీసు ముందు ఆమరణ దీక్షకు దిగుతానంటూ బాధితురాలి తల్లి ప్రకటించడం ఆసక్తిగా మారింది. రీసెంట్‌గా జనసేన పార్టీ సమావేశంలో సుగాలి ప్రీతి వ్యవహారంపై నోరు విప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
సుగాలి ప్రీతి కేసు విషయంలో సీఐడీ, హోంమంత్రి, డీజీపీతో మాట్లాడినట్టు తెలిపారు డిప్యూటీ సీఎం. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రీతి కేసులో సాక్ష్యాలు తారుమారు అయ్యాయన్నారు. అందువల్లే కేసు ముందుకు కదల్లేదన్నారు. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో చేయూతనిచ్చిన వారినే తిడితే ఎలా ప్రశ్నించారు.
సీఐడీ విచారణ చేపట్టిన తర్వాత తేలిన అంశం ఏంటంటే అనుమానితుల డీఎన్ఏలు సరిపోలడం లేదని, సాక్ష్యాలు తారుమారు చేశారని చెప్పారు. గత ప్రభుత్వం తప్పుల కారణంగా కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయిన్నారు. సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు.
ఈ కేసుపై మంగళవారం సమీక్షించారు సీఎం చంద్రబాబు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటన చేశారు. దర్యాప్తు సంస్థకు లేఖ రాసి వెంటనే దర్యాప్తు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు తెలంగాణలో సంచలన రేపిన అడ్వకేట్ గట్టు వామనరావు దంపతుల హత్యపై సీబీఐ రంగంలోకి దిగేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో FIR నమోదు చేసింది సీబీఐ. FIRలో వసంతరావు, కుంట శ్రీనివాస్, కుమార్ పేర్లు ప్రస్తావించింది. 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి పీఎస్ పరిధిలో వామన్‌రావు దంపతులను అత్యంత కిరాతకంగా నరికి చంపారు నిందితులు.