Vijayawada: వైసీపీ అరాచకాలకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టనుందా? విజయవాడ శాప్ ఆఫీసు వద్ద ఘటనపై ప్రభుత్వం సీరియస్ వెనుక ఏం జరిగింది? ఆందోళన ముసుగులో టీచర్లపై కొందరు మద్యాన్ని విసిరారా? అక్కడికి వచ్చిన ఆందోళనకారుల్లో ఎక్కువమందిపై కేసులున్నాయా? 60 మందిపై కేసులు నమోదు అయినట్టు తెలుస్తోంది.
సోమవారం విజయవాడలో శాప్ ఆఫీసు వద్ద డీఎస్సీ స్పోర్ట్ కోటా ఉపాధ్యాయులపై దాడిని ప్రభుత్వం ఖండించింది. దీనిపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. దాడి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేయాలని, ఏ ఒక్కర్నీ వదిలి పెట్టవద్దని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది ప్రభుత్వం. అంతేకాదు దాడిలో పాల్గొన్న వైసీపీ నేతలు, రౌడీ షీటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ, వీడియో ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. దాడిలో పాల్గొన్నవారిని గుర్తించి చర్యలకు సిద్దమయ్యారు.
ఈ దాడికి సంబంధించి మూడు లేదా నాలుగు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. మూకుమ్మడి దాడులు, నిబంధనల ఉల్లంఘన, పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం వంటి కేసులు నమోదు అయినట్టు తెలుస్తోంది. మాచవరం, సూర్యారావుపేట, కృష్ణలంక పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసుల నమోదు ప్రక్రియ మొదలైంది. ఘర్షణల్లో పాల్గొన్న రౌడీషీటర్లను వెంటనే అదుపులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. విజయవాడకు చెందినవారు కాకుండా మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి నుంచి కొంతమంది రౌడీషీటర్లు పాల్గొన్నట్లు సమాచారం.
ఇప్పటికే కొంతమంది రౌడీషీటర్లను గుర్తించి అధికారులు, రేపో మాపో వారిని అరెస్టు చేయాలని ఆలోచిస్తోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. వైసీపీ గ్యాంగ్‌లు కర్రలు, రాడ్లు, కోడిగుడ్లు, రాళ్లు తీసుకురావడం వెనుక పక్కా ప్లాన్ ఉందన్నది కొందరు అధికారులు భావిస్తున్నారు.
అంతేకాదు ఉపాధ్యాయులు వస్తారని భావించిన వైసీపీ నేతలు, వారిపై మద్యం చల్లినట్టు తెలుస్తోంది. ఆ విధంగా చేస్తే శాప్ కార్యాలయం చొరబడవచ్చని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఉపాధ్యాయుల ముందే మద్యం సీసాలు తెరిచి వారిపై చల్లుతూ రెచ్చిపోయారు కొందరు అల్లరి మూకలు. ఈ విషయం బయటకు చెబితే పరువుపోతుందని భావించి, బయటకు చెప్పుకోలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు.
ALSO READ: బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీ-ఒడిషా భారీ వర్షాలు, తెలంగాణలో కూడా
మొత్తం 60 మందిపై రకరకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చాలామంది వైసీపీ ముఖ్యనేతలను నిందితులుగా చేర్చనున్నారట. వారిలో దేవినేని అవినాష్, జక్కంపూడి రాజా, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, మొండితోక అరుణ్, స్వామిదాసు, రుహుల్లా, గౌతంరెడ్డి, బొల్లా బ్రహ్మనాయడు, మేరుగు నాగార్జున, చంద్రశేఖర్ రెడ్డి, వరుదు కల్యాణి, హనుమంతరావు పేర్లను చేరినట్టు సమాచారం. శాప్ డైరెక్టర్ సంతోష్‌పై దాడి చేశారు వైసీపీ నేతలు.