CII Summit 2026: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న సీఐఐ సమ్మిట్ – 2026లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తో కలిసి సినీ నటుడు రానా దగ్గుబాటి పోడ్ కాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ మనసులోని మాటలను ఇరువురు వేదికపై పంచుకున్నారు. పోడ్ కాస్ట్ ప్రారంభంలో ముందుగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ఇటీవల నిర్మించిన భోగాపురం ఎయిర్ పోర్టుపై ప్రశంసల జల్లు కురిపించారు. తాను తొలిసారి ఈ విమానాశ్రయంలో దిగానని.. అక్కడి నుంచి విశాఖ వరకూ రోడ్డు మార్గం ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఎయిర్ పోర్టు నుంచి విశాఖకు రావాలంటే గంటల సమయం పడుతుందని చాలా మంది అన్నారని.. కానీ ఈ జర్నీ ఎంతో బ్యూటిఫుల్ గా సాగిందని పేర్కొన్నారు.
భోగాపురం విమానాశ్రయంపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రానికైనా ఎయిర్ పోర్టు అనేది గేట్ వేగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు గేట్ వేగా భోగాపురాన్ని అభివర్ణించారు. అయితే ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా జీఎంఆర్ గారు.. ‘ఆర్ యూ హ్యాపీ’ అని అడిగారని లోకేశ్ తెలిపారు. అప్పుడు తాను సంతోషంగా లేనని (I’am Not Happy) చెప్పినట్లు పేర్కొన్నారు. ఎందుకంటే ఏ రోజైతే హైదరాబాద్ కంటే అతిపెద్ద విమానాశ్రయంగా భోగాపురం మారుతుందో ఆ రోజున తాను అందరికంటే ఎక్కువ సంతోషిస్తానని జీఎంఆర్ కు సమాధానం ఇచ్చినట్లు వివరించారు. ఆ దిశగా భోగపురాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక కమిట్ మెంట్ తో ముందుకు సాగుతున్నట్లు లోకేశ్ స్పష్టం చేశారు.
అటు సీఐఐ సమ్మిట్ – 2026 పాల్గొనే వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల నుంచి నవ్యాంధ్రప్రదేశ్ ఏం ఆశిస్తోందని దగ్గుబాటి రానా అడిగిన ప్రశ్నకు లోకేశ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అందరికీ కల ఉంటుందని.. ఆ కలను నిజం చేసుకునే శక్తి, పట్టుదల కొందరిలోనే ఉంటుందని చెప్పారు. అది ఆంధ్రప్రదేశ్ లో ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు తరలివచ్చేందుకు అనూకులమైన వాతావరణం, కమ్మిట్ మెంట్ ఉన్న పాలనాయంత్రాంగం ఇవాళ ఏపీలో ఉందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. దానికి ప్రతిఫలమే ఇవాళ మిట్టల్ స్టీల్ ప్లాంట్, భోగాపురం విమానాశ్రయం, గూగుల్ డేటా బేస్ సెంటర్ ఏపీకి వచ్చాయని గుర్తుచేశారు.
Also Read: ఆవు పేడతో అద్భుతం.. రూ. లక్షల్లో సంపాదిస్తున్న సాధారణ మహిళ.. ఇదెక్కడి వెరైటీ బిజినెస్!
మరోవైపు సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ దగ్గుబాటి రానా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలు సినిమాలను ఎంతగానో ఆదరిస్తారని పేర్కొన్నారు. దేశంలో జనాభా పరంగా పదో స్థానంలో ఉన్నామని.. కానీ వినోదరంగంలో 70 శాతం రెవెన్యూ నిలకడగా తెలుగు రాష్ట్రాల నుంచే వస్తోందని రానా అన్నారు. ఏ ఇండస్ట్రీకి చెందిన సినిమా అయినా డబ్ అయ్యి తెలుగులోకి వస్తే దాన్ని ఆదరించే గొప్ప మనసు తెలుగు ప్రేక్షకులకు ఉందన్నారు. హిందీ, తమిళం, మలయాళం, చివరికీ కొరియన్ సినిమాలైనా కథ నచ్చితే తెలుగు ప్రజలు అక్కున చేర్చుకుంటారని ప్రశంసించారు. మరే ఇతర భాష ప్రేక్షకుల్లో తాను ఇది చూడలేదని చెప్పుకొచ్చారు.
Also Read: రూ.25 లక్షల లోపు బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్, ఫీచర్లు అదుర్స్!