Arnab-Murasu Cyclones: అమరావతి వేదికగా ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సీఎం చంద్రబాబు జరిపిన మీడియా సమావేశం.. ఇటీవల రాష్ట్రాన్ని వణికించిన అర్నబ్, మురసు తుఫాన్ల తీవ్రతను, ప్రభుత్వం చూపిన వేగాన్ని కళ్లముందు ఉంచింది. ప్రకృతి కోపానికి ఎదురొడ్డి నిలబడి, ఊహించని నష్టాల నుంచి ప్రజలను కాపాడుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం ఏ స్థాయిలో పనిచేసిందో ఆయన సమగ్రంగా వివరించారు.
పక్కా ప్రణాళిక.. సాంకేతికతతో ముందస్తు అంచనా
ప్రకృతి వైపరీత్యాల వేళ ప్రాణనష్టాన్ని సున్నాకి తీసుకురావడం, ఆస్తినష్టాన్ని వీలైనంత తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం కదిలింది. అవేర్ వ్యవస్థ అందించిన డేటా సహాయంతో గాలుల వేగం, వర్షపాతం, వరద నీటి మళ్లింపును 90 శాతం కచ్చితత్వంతో అంచనా వేయగలిగాం. ముంపు ముప్పు ఉన్న గ్రామాలను ముందే గుర్తించి, అవసరమైన సిబ్బందిని, యంత్రాలను ఫీల్డ్‌లో సిద్ధంగా ఉంచడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందనే సీఎం పేర్కొన్నారు.
20 రోజుల పని.. 5 రోజుల్లోనే..
ఈ రెండు తుఫాన్ల వల్ల అత్యంత దారుణంగా దెబ్బతిన్నది విద్యుత్ వ్యవస్తే. ఏకంగా21 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 548 సబ్ స్టేషన్ల నుంచి సరఫరా నిలిచిపోయి 4 095 గ్రామాలు చీకట్లోకి వెళ్లిపోయాయి. సాధారణంగా ఈ స్థాయి ధ్వంసాన్ని బాగుచేయడానికి కనీసం 20 రోజులు పడుతుంది. కానీ పట్టుదలతో ,రాత్రింబవళ్లు కురిసే వర్షంలోనూ డ్రిల్లింగ్ మిషన్ల సహాయంతో కొత్త స్తంభాలు నాటుతూ విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేశారు. ఫలితంగా కేవలం 4 నుంచి 5 రోజుల్లోనే సాధారణ పరిస్థితులు తీసుకొచ్చారు.
సమిష్ఠి శ్రమతో సాధారణ స్థితికి..
టాప్ టు బాటమ్ అధికారులందరినీ ఒకే తాటి పైకి తెచ్చి, ఆర్టీజీఎస్ ద్వారా క్షేత్రస్థాయికి వేగంగా సమాచారం అందించడం వల్లే సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. ఆక్వా చెరువుల్లో పడిపోయిన విద్యుత్ పోల్స్ నుంచి మారుమూల గ్రామాల వరకు పునరావాసం అందించడంలో సిబ్బంది చూపిన ప్రతిభ అభినందనీయమని సీఎం చంద్రబాబు కొనియాడారు. సాంకేతికతకు మానవ శ్రమ తోడైతే ఎలాంటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఈ ఘటన నిరూపించింది.
Also Read: మురసు తుఫాన్ ఎఫెక్ట్.. కావలి వద్ద నిలిచిన రైళ్లు.. ప్రయాణికుల తీవ్ర అవస్థలు