Chandrababu Naidu: తిరుపతి నగర రూపురేఖలను మార్చేలా, భక్తులకు సరికొత్త వసతులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో రూ.3,222 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్ విధానంలో నేడు శ్రీకారం చుట్టనున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల ఇబ్బందులను తొలగించడం , టీటీడీ ఉద్యోగుల చిరకాల కోరికను నెరవేర్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
శ్రీవారి భక్తుల కోసం మెరుగైన వసతులు
తిరుమల కొండపై భక్తుల రద్దీని గణనీయంగా తగ్గించేందుకు కొండ కింద తిరుపతిలోనే అత్యాధునిక సదుపాయాలను విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా రూ.1,332 కోట్ల భారీ అంచనాతో నాలుగు ప్రత్యేక బ్లాకుల్లో 2,700 గదులతో కూడిన వసతి సముదాయాలను నిర్మించనున్నారు. దీనివల్ల ప్రతిరోజూ సుమారు 15 వేల మంది భక్తులు సౌకర్యవంతంగా బస చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా, రూ.160 కోట్లతో ఒకేసారి 6 వేల మందికి పైగా భక్తులు అన్నప్రసాదం స్వీకరించేలా సరికొత్త అన్నప్రసాద కేంద్రం రానుంది.
రవాణా, పార్కింగ్, ఇతర సదుపాయాలు
భక్తుల రాకపోకలను సులభతరం చేసేందుకు రూ.311 కోట్లతో ఏకకాలంలో 4,500 వాహనాలు నిలిపేలా బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాన్ని, రూ.90 కోట్లతో 30 బస్ బేలతో కూడిన ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. అలాగే, రూ.486 కోట్లతో నాలుగు పిలిగ్రిమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ఒకేసారి 16 వేల మంది భక్తులు స్నానాలు చేసి విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ టౌన్‌షిప్‌లో డిజిటల్ సమాచార కేంద్రాలు, అత్యవసర వైద్య సహాయ సేవలు, పటిష్టమైన భద్రతా వ్యవస్థలను కూడా అందుబాటులోకి తెస్తున్నారు.
టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల సాకారం
కేవలం భక్తుల సౌకర్యాలే కాకుండా, టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేసింది. సుమారు 418 ఎకరాల విశాలమైన స్థలంలో రెండు దశలుగా 5,192 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయించనున్నారు. ఈ నివాస లేఅవుట్‌లో అంతర్గత బీటీ రోడ్లు, సురక్షితమైన తాగునీటి సరఫరా, డ్రైనేజీ మరియు విద్యుత్ సదుపాయాల కల్పన కోసం రూ.230 కోట్లు వెచ్చిస్తున్నారు.
మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం
తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా, రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు మరో రూ.242 కోట్ల వ్యయంతో 9 మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణ పనులను కూడా ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. ఈ అభివృద్ధి పనులన్నీ పూర్తయితే తిరుపతికి వచ్చే యాత్రికులకు వసతి, భోజనం, రవాణా, పార్కింగ్ వంటి సేవలు అన్నీ ఒకే చోట ప్రశాంతంగా లభించనున్నాయి.
Also Read: ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం!