Ayyanna patrudu : టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్ వ్యవహారం ఏపీలో తీవ్ర కలకలం రేపింది. అయ్యన్న అరెస్టుపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలంటూ మండిపడ్డారు.
తాజాగా, అయ్యన్న ఎపిసోడ్ పై ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ కుమార్ నాయక్ స్పందించారు. ఎన్వోసీని ఫోర్జరీ చేయడం మామూలు విషయం కాదని.. ఆ అభియోగాలతోనే అయ్యన్నపాత్రుడుని అరెస్ట్ చేశామని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని.. అందుకే ఆయనపై ఐపీసీ 464, 467, 471, 474, రెడ్ విత్ 120-బి, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.అయ్యన్నను ఏ1గా, ఆయన కుమారులు విజయ్ ఏ2, రాజేశ్ ఏ3గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్టు సునీల్ కుమార్ తెలిపారు.
గతంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి గోడను కూల్చేయగా.. ఆ ఘటన అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి కాంపౌండ్ వాల్ కట్టారని మున్సిపల్ అధికారులు ఆ గోడను కూల్చేశారు. దీనిపై విచారణ జరుగుతుండగా.. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేశారనేది అయ్యన్నపై అభియోగం. ఫోర్జరీ పత్రాలు ఇచ్చారంటూ గురువారం తెల్లవారుజామున నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటిపై పోలీసులు దాడి చేసి, గోడ దూకి ఇంట్లోకి వెళ్లి ఆయనతో పాటు కుమారులనూ అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో.. అరెస్టుపై క్లారిటీ ఇచ్చారు సీఐడీ డీఐజీ సునీల్.
అయితే, ఫోర్జరీ కేసుకే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి.. అరెస్ట్ చేయాలా? అనేది టీడీపీ ప్రశ్న. ఇది కచ్చితంగా కక్ష సాధింపు చర్యనే అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు పార్టీ శ్రేణులు. హైకోర్టునూ ఆశ్రయించారు. అయ్యన్న అరెస్టు వ్యవహారం మరింత ముదిరేలా ఉంది.