ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రాయలసీమ జిల్లాల్లో పర్యటించారు. ఈ మేరకు కర్నూలు జిల్లాలోని పుచ్చకాయలమడ గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను వైసీపీ సర్కారు ధ్వంసం చేసిందని గ్రామసభలో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే జగన్ పోతూ పోతూ ఏపీ ఖజానా సైతం ఖాళీ చేసి వెళ్లారని, దాదాపుగా రూ.10 లక్షల కోట్ల అప్పులు మిగిలాయన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు చైతన్యంతో కూటమికి ఓట్లేసి అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారని కొనియాడారు. ఈ క్రమంలోనే కూటమికి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫించన్ 4 వేల రూపాయలు చేశామని చెప్పుకొచ్చారు.
కూటమి సర్కారులో ఒకటో తేదీ రాగానే అధికారులే ఫించన్లు పట్టుకుని మీ ఇంటికొచ్చి ఇస్తున్నారని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని వివరించారు. ఉద్యోగులకు సైతం తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెలా జీతాలు సమయానికే ఇస్తున్నామని గుర్తు చేశారు.
also read : కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా?.. అయితే ఈ శుభవార్త తెలుసా..?
జీతాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందనవసర లేదని నొక్కి చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఎన్నోమందిని చూశానన్న సీఎం, ఇలాంటి వ్యక్తిని మాత్రం ఎక్కడా చూడలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఇతను చెయ్యకూడని తప్పులు చేశాడని, అవన్నీ ప్రజలకు ప్రతిబంధకంగా మారాయన్నారు.